Site icon NTV Telugu

SatyaKumar: కేంద్ర ప్రభుత్వ పథకం లెక్కలను సీఎం జగన్ ట్యాంపరింగ్ చేశారు

Satya Kumar

Satya Kumar

SatyaKumar: ఏపీ బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జల్ జీవన్ మిషన్‌లో ఏపీ ప్రభుత్వం ఆశించిన ఫలితాలను సాధించడంలో ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. అయినా తప్పుడు లెక్కలు, ఉత్తుత్తి ప్రకటనలతో జగన్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని సత్యకుమార్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఈ విషయం గురించి ట్వీట్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి రక్షిత మంచి నీటిని అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకం ప్రవేశపెట్టిందని సత్యకుమార్ అన్నారు. అయితే ఏపీలో ఈ పథకం అమలు అధ్వాన్నంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఈ పథకాన్ని వంద శాతం మేర అమలు చేశామని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం నివేదిక పంపిందని తెలిపారు.

కానీ వాస్తవానికి ఏపీలో కేవలం 20 శాతం గ్రామాలకు మాత్రమే జల్ జీవన్ మిషన్ పథకం ఫలాలు అందాయని సత్యకుమార్ వెల్లడించారు. జల్ జీవన్ మిషన్ లెక్కలను సీఎం జగన్ టాంపరింగ్ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలోని 3,544 గ్రామాలకు 100 శాతం కుళాయి కనెక్షన్ ఇచ్చినట్లు లెక్కలు చూపారని.. కానీ 735 గ్రామ పంచాయతీల్లో మాత్రమే పని పూర్తి చేశారన్నారు. అంటే కేవలం 20.74 శాతం మాత్రమే ఈ పథకం ఫలాలు అందాయని.. మిగిలిన 80.26% మోసమేనని సత్యకుమార్ ఆరోపించారు. ఇలాంటి తప్పుడు లెక్కలు చూపించడంలో జగన్ సిద్ధహస్తుడని చురకలు అంటించారు. తప్పుడు ప్రచారం చేస్తూనే జగన్ మూడున్నరేళ్ల పాటు పాలన సాగించారని ఆరోపించారు. తప్పుడు సలహాలు ఇవ్వడానికి ప్రత్యేకంగా 45 మంది సలహాదారులను పెట్టుకొని వారికి రూ.130 కోట్లు ఖర్చు పెట్టారంటూ ఏపీ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఎద్దేవా చేశారు.

Exit mobile version