ఆంధ్ర ప్రదేశ్ ఆందోళనకర పరిస్థితుల్లో ఉందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరాచార్యులు సమాధి పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి వెంకటగిరి పట్టణంలో పర్యటించి స్థానిక కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జగన్ పాలనపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదిక కూల్చడంతో విధ్వంస పరిపాలనకి నాంది పలికారన్నారు. రాష్ట్రంలో గుళ్ళు గోపురాలు, మూల విరాట్టులను సైతం ధ్వంసం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తే వెంటనే ఎస్ సి, ఎస్ టి అట్రాసిటీ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేసి మోయలేని భారాన్ని ప్రజలపై వేస్తోందన్నారు పురంధేశ్వరి.
జగన్ అధికారంలోకి వచ్చిన నాటికి 2లక్షల50 వేల కోట్లు అప్పు చేశారు. ఇప్పుడది 6లక్షల కోట్లు దాటిందంటే ఎంతటి ఆందోళనకర పరిస్థితుల్లో రాష్ట్రం ఉందో అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులతో కొత్తగా పరిశ్రమలు పెట్టే పరిస్థితులే లేవన్నారు. పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు. అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా విధ్వంసాలు, విద్వేషాలను రెచ్చగొట్టేలా వైసీపీ పాలన సాగుతోందన్నారు పురంధేశ్వరి.