Vidadala Rajini: ఏపీ వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి విడదల రజినీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సెప్టెంబర్ 1 నుంచి బయోమెట్రిక్ హాజరును అమల్లోకి తీసుకొస్తున్నట్లు ఆమె ప్రకటించారు. అన్ని స్థాయిల సిబ్బందికి ప్రత్యేక యాప్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. అర్హులైన ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందేలా చూడాలని, ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి విడదల రజినీ ఆదేశించారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఆయుష్ డిస్పెన్సరీలను పెంచేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆమె సూచించారు.
Read Also: Viral Video: ఇది బైక్ కాదు.. మినీ వ్యాన్.. ఒకే బైకుపై ఏడుగురు ప్రయాణం
త్వరలోనే ఫ్యామిలీ డాక్టర్ సేవలు తెచ్చి ఇంటింటికి వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి విడదల రజినీ అన్నారు. కుటుంబ వైద్యుల విధానం అమలులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇంటింటికీ వైద్య సేవలు అందిస్తుందని స్పష్టం చేశారు. ఈ విధానం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 176 మంది వైద్యాధికారులు, 1,681 మంది మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లను నియమిస్తున్నట్లు మంత్రి విడదల రజినీ తెలిపారు. వైఎస్‌ఆర్ హెల్త్ క్లినిక్‌లలో 65 రకాల మందులను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. అటు ఫేస్ రికగ్నైజేషన్ యాప్ కోసం కసరత్తు చేస్తున్నామని, ప్రత్యేకించి ఫీల్డ్‌లో పనిచేస్తున్న సిబ్బందికి ఈ యాప్ ద్వారా అటెండెన్స్ అవకాశం కల్పిస్తామని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలియజేశారు.
