ప్రకాశం జిల్లా ఒంగోలులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒంగోలు బైపాస్ రోడ్డులోని ఉడ్ కాంప్లెక్స్ శివారులో పార్కింగ్ చేసి ఉన్న కావేరి ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సులో తొలుత మంటలు చెలరేగగా.. ఆ మంటలు నెమ్మదిగా పక్కన ఉన్న బస్సులకు కూడా వ్యాపించాయి. దీంతో ఆ ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో సుమారు 8 ప్రైవేట్ బస్సులు అగ్నికి ఆహుతి అయ్యాయని తెలుస్తోంది.
ఈ ప్రమాదంపై వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయినా అప్పటికే బస్సులు కాలిపోయినట్లు ఫైర్ సిబ్బంది వెల్లడించారు. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలను వారు విశ్లేషిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదం వల్ల భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. పార్కింగ్ స్టాండ్‌లో దాదాపు 20కి పైగా బస్సులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.