NTV Telugu Site icon

Bhumana Karunakar Reddy: ఆనాటి టీడీపీ ప్రభుత్వం వైసీపీ నేతల ఫోన్‌లను ట్యాప్ చేసింది

Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy

టీడీపీ హయాంలో పెగాసస్ సాఫ్ట్‌వేర్ వాడిన అంశంపై వరుసగా రెండోరోజు హౌస్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా పెగాసస్‌పై నియమించిన హౌస్ కమిటీ అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతల సమాచారాన్ని అప్రజాస్వామికంగా తస్కరించిందన్నారు. ఈ అంశంపై నిన్న, ఇవాళ సంబంధిత శాఖల అధికారులతో ప్రాథమికంగా చర్చించినట్లు తెలిపారు. తమకు కావాల్సిన సమాచారాన్ని అడిగామని.. వచ్చే సమావేశంలో మరింత లోతుగా అధ్యయనం చేస్తామని పేర్కొన్నారు. జూలై 5న మరోసారి హౌస్ కమిటీ సమావేశమవుతుందని చెప్పారు.

పెగాసస్ వ్యవహారంపై మూడు నెలల్లోగా విచారణ పూర్తి చేసి నివేదికను సభ ముందు పెడతామని భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం డేటా చౌర్యం విషయంలో అనేక దొంగ పనులు చేసిందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పామన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పిన అంశాలు కూడా కమిటీ పరిగణనలోకి తీసుకుంటుందని వివరించారు.

అప్పటి టీడీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసి ప్రైవేట్ ఏజెన్సీల నుంచి సాఫ్ట్‌వేర్ కొనుగోలు చేసిందని భూమన విమర్శలు చేశారు. వ్యక్తుల వ్యక్తిగత గోప్యత, అప్రజాస్వామికంగా ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేశారన్నారు. కమిటీ కేవలం పెగాసస్ అంశానికి మాత్రమే పరిమితం కాదని.. అవసరమైతే అప్పుడు నిఘా విభాగంలో పని చేసిన అధికారులను పిలిపిస్తామని తెలిపారు. దోషులను ప్రజల ముందు నిలబెడతామన్నారు. ఆనాడు టీడీపీ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేశారని శాసన సభ నమ్మిందని.. కమిటీ కూడా ఈ అంశాన్ని నమ్ముతోందని భూమన అన్నారు.

PattabhiRam: గృహ నిర్మాణంపై ప్రభుత్వానివి అసత్య ప్రకటనలు

Show comments