పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సంక్రాంతి ఉత్సవాలు అంబరాన్నంటాయి. అయితే, ఈ వేడుకల్లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం భీమవరం డీఎస్పీ రఘువీర్ చేసిన వ్యాఖ్యలే. పోలీస్ యూనిఫాంలో వేదికపైకి ఎక్కిన ఆయన, తనలోని కళా హృదయాన్ని బయటపెడుతూ చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. భీమవరం సంక్రాంతి సంబరాల్లో అసలు ఊపు లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
వేదికపై మైక్ అందుకున్న డీఎస్పీ రఘువీర్, ప్రేక్షకుల నిస్తేజంపై సూటిగా స్పందించారు. “భీమవరం సంక్రాంతి సంబరాలు అనిపించట్లేదు.. అసలు ఆ ఊపు లేదు, ఆ కేక లేదు” అని ఆయన బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. సంక్రాంతి అంటేనే ఉత్సాహం, కేరింతలు ఉండాలని, కానీ ఇక్కడ ప్రేక్షకులు సైలెంట్‌గా ఉండటం తనకు నచ్చలేదని ఆయన సరదాగా మందలించారు.
డీఎస్పీ ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా సినిమా పాటలను ప్రస్తావిస్తూ చేసిన కామెంట్లు నవ్వులు పూయించాయి. “ఓరోరి యోగి నన్ను కుదిపేయరా అంటూ డాన్సర్ పాడుతుంటే, కనీసం ఎవరూ కుదుపుకోకపోతే ఎలాగయ్యా?” అని ప్రశ్నించారు. అంతేకాకుండా, సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించిన ‘కుర్చీ మడతపెట్టి’ పాటను ఉద్దేశించి.. “ఆమె అక్కడ కుర్చీ మడతపెడుతుంటే, కనీసం ఎవరూ మడతపెట్టకపోతే ఎలా?” అంటూ ఆవేదనతో కూడిన ప్రశ్నలు సంధించారు.
డీఎస్పీ రఘువీర్ చేసిన ఈ వ్యాఖ్యలకు స్టేజీపై ఉన్న తోటి అధికారులు, ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆయనలోని ఉత్సాహాన్ని చూసి ప్రేక్షకులు ఈలలు, కేకలతో సందడి చేశారు. శాంతిభద్రతలను పర్యవేక్షించే ఉన్నతాధికారి హోదాలో ఉండి కూడా, ప్రజలతో మమేకమవుతూ ఆయన చేసిన ఈ ‘మాస్’ ప్రసంగం భీమవరం పండగ సంబరాల్లో హైలైట్‌గా నిలిచింది. మొత్తానికి, భీమవరం డీఎస్పీ రఘువీర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూ, “డీఎస్పీ గారు మామూలోడు కాదు.. భలే కుదిపేశారు!” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
