Site icon NTV Telugu

Repalle Case: రైల్వేస్టేషన్‌లో గ్యాంగ్ రేప్.. బాపట్ల జిల్లా ఎస్పీ ఏమన్నారంటే..?

Repalle Rape Case

Repalle Rape Case

బాపట్ల జిల్లా రేపల్లెలో వివాహితపై అత్యాచారం కేసుపై జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్పందించారు. రేపల్లె రైల్వేస్టేషన్‌లో అర్ధరాత్రి ఒంటిగంటకు మద్యం మత్తులో ముగ్గురు యువకులు భార్యాభర్తల వద్దకు వచ్చారని.. సదరు యువకులు టైం అడిగితే భార్యాభర్తలు వాచ్ లేదని చెప్పడంతో దాడి చేసి నగదు లాక్కున్నారని తెలిపారు. భర్తపై దాడి చేస్తుంటే భార్య అడ్డుపడిందని.. నిందితులు వివాహితను పట్టుకుని అత్యాచారం చేశారని.. ఇద్దరు యువకులు అత్యాచారం చేయగా.. మరొకరు సహకరించారని ఎస్పీ వకుల్ జిందాల్ వివరించారు.

ఈ ఘటన జరిగిన వెంటనే భర్త సమీపంలోని రేపల్లె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. పోలీసులు వెహికల్‌ ద్వారా సైరన్‌తో రావడంతో నిందితులు పరారయ్యారని పేర్కొన్నారు. ఉదయం ఏడు గంటలకు నిందితులను‌ గుర్తించామన్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ద్వారా ఆధారాలు సేకరించామని.. ముగ్గురు యువకులను అరెస్ట్ చేశామని వెల్లడించారు. ముగ్గురు నిందితులలో ఒకరు గతంలో ఓ చోరీ కేసులో ముద్దాయిగా ఉన్నాడని.. కేసులో సీసీ ఫుటేజ్, టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించామన్నారు. త్వరలోనే ఛార్జిషీట్ దాఖలు చేస్తామని.. నిందితులపై 376(డి), 394, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. బాధితురాలిది ప్రకాశం జిల్లా కావడంతో చికిత్స కోసం ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించామని ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు.

Women Assault: రేపల్లెలో వివాహితపై అఘాయిత్యం

Exit mobile version