Bandaru Satyanarayana Murthy Fires On Visakha Garjana: వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖపట్నంలో చేపట్టిన ‘విశాఖ గర్జన’ కార్యక్రమంపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు చేస్తోంది విశాఖ గర్జన కాదని.. పిల్లి కూతనో, కుక్క అరుపునో చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కప్పల అప్పల్రాజు కప్పలా అరుస్తున్నాడంటూ విమర్శించారు. ఉత్తరాంధ్రను తామే అభివృద్ధి చేశామని.. ఒకవేళ టీడీపీ అభివృద్ధి చేసిందని నిరూపించలేకపోతే తమ చెప్పుతో తామే కొట్టుకుంటామని సవాల్ చేశారు. విశాఖ భూములపై వేసిన సిట్-1, సిట్-2 నివేదికలు ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. సిట్ నివేదికలో ఉన్న అంశాలని పట్టుకుని.. జగన్, విజయసాయి బేరాలు పెట్టుకుంటున్నారని ఆరోపించారు. రెండు సిట్ నివేదికలు బయటకొస్తేజజ జగన్, విజయసాయి రెడ్డిలకు జైల్లో బ్యారెక్స్ సిద్దంగా ఉంటాయన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తే మంచిదని మంత్రి ధర్మాన ఎలా అంటారని ప్రశ్నించారు.
అంతకుముందు.. విశాఖలో భూములు కాజేసేందుకు వైసీపీ నేతలు ఎప్పట్నుంచో దృష్టి పెట్టారని, అధికారంలోకి రాగానే స్వాహా మొదలుపెట్టారని బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడానికి విజయసాయిరెడ్డి ప్రయత్నిస్తున్నారని అన్నారు. విజయసాయిరెడ్డి అవినీతి డబ్బుతో ఛానల్ పెడతానని అంటున్నారని.. సీఎం జగన్‌ను బ్లాక్‌మెయిల్ చేసేందుకు ఈ నాటకాలు ఆడుతున్నారని విరుచుకుపడ్డారు. జగన్, విజయసాయి వల్ల ఎంతోమంది జైలుపాలయ్యారని.. వీళ్లు మాత్రం ప్రధాని మోడీ దయతో బయట తిరుగుతున్నారని అన్నారు. అసలు విజయసాయికి విశాఖతో పని ఏమిటని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి కూతురు, అల్లుడు విశాఖలో రూ.వేల కోట్ల విలువైన భూములను కొనుగోలు చేశారని, ఇందులో కొన్ని అక్రమ లావాదేవీలు ఉన్నాయని విమర్శించారు.హయగ్రీవ, కూర్మన్నపాలెం ప్రాజెక్టుల వ్యవహారాలపై సిబిఐ, ఇడి విచారణకు సీఎం జగన్ ఆదేశించాలని డిమాండ్ చేశారు.