ఏపీలో ప్రభుత్వానికి, ప్రభుత్వ ఉద్యోగుల మధ్య పీఆర్సీ రగడ నడుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమానికి చాలా ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి. ఉపాధ్యాయ సంఘాలు, విద్యుత్ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు సంఘీభావం ప్రకటించారు. అయితే ఆర్టీసీలో ఓ వర్గం ఉద్యోగులు మాత్రం తాము ఆందోళనల్లో పాల్గొనేది లేదని స్పష్టం చేశాయి. సీఎం జగన్ తమకు మంచే చేశారని… ఉద్యోగ సంఘాల ఉద్యమంలో తాము భాగం కాలేమని ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రకటించింది. ఈ మేరకు తాము సమ్మెలో పాల్గొనడం లేదని మంత్రి సజ్జలకు లేఖ కూడా ఇచ్చామని తెలిపింది.
Read Also: రేపు హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ భారీ ర్యాలీ
అటు పీఆర్సీ సాధన సమితికి మద్దతుగా ఆర్టీసీ సంఘాలు సమ్మె చేస్తామనడం కరెక్ట్ కాదని.. ఆ ఉద్యోగుల పీఆర్సీకి తమ ఆర్టీసీ పీఆర్సీకి సంబంధం లేదని ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ మల్లిఖార్జునరెడ్డి వెల్లడించారు. ఆర్టీసీని నష్టాల్లోంచి బయటకు తేవాలని సీఎం జగన్ కష్టపడుతున్నారని.. గతంలో ఆర్టీసీలో ఉద్యోగులకు, సిబ్బందికి జీతాలివ్వాలంటే ఏదో ఒకటి తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి ఉందన్నారు. పాదయాత్రలో సీఎం జగన్ యూనియన్లకు ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని గుర్తు చేశారు.
