NTV Telugu Site icon

APSPDCL: సత్యసాయి జిల్లాలో ప్రమాదంపై విద్యుత్‌శాఖ వివరణ.. ఉడతే కారణం..!

Apspdcl

Apspdcl

శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం.. ఐదుగురిని పొట్టన బెట్టుకుంది.. ఆటోపై హైటెన్షన్‌ వైర్లు పడిన ఘటనలో మంటలు చెలరేగి మొత్తం ఎనిమిది మంది సజీవదహనం అయినట్టు ముందుగా భావించినా.. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందినట్టు అధికారులు నిర్ధారించారు. ఇక, ఈ ప్రమాదంపై ఏపీ విద్యుత్‌శాఖ ఇచ్చిన వివరణ వివాదాస్పదంగా మారింది. తాడిమర్రిలో ఆటోపై హైటెన్షన్ విద్యుత్ తీగ తెగిపడి మహిళా కూలీలు సజీవ దహనమైన ఘటనపై ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్ హరినాధరావు స్పందించారు.. ఈ ఘటనపై విచారణ జరిపి తక్షణం నివేదిక అందించాల్సిందిగా అనంతపురం సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ను ఆదేశించారు.

Read Also: Rocketry Movie Review: రాకెట్రీ రివ్యూ

ఇక, ఈ ఘటనలో మృతిచెందినవారికి ఐదు లక్షల చొప్పున, క్షతగాత్రులకు రెండు లక్షల చొప్పున తక్షణ ఆర్థిక సాయం అందించనున్నట్టు ప్రకటించారు హరినాథరావు.. క్షేతగాత్రులకు మెరుగైన వైద్యం కోసం చర్యలు తీసుకోవాలని అనంతపురం ఎస్‌ఈని ఆదేశించారు.. అయితే, హై టెన్షన్ విద్యుత్ లైన్ పై ఉడుత పడిన కారణంగానే విద్యుత్ తీగ తెగిపోయిందన్నారు.. ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. అయితే, ఉడత వల్లే కరెంట్‌ వైర్‌ తెగిందా..? ప్రమాదానికి అదే కారణమా? నమ్మడానికి వీలులేకున్నా.. అదే కారణం అంటున్నారు.. మొత్తంగా.. ఆటో ప్రమాదంపై విద్యుత్‌ శాఖ ఇచ్చిన వివరణ వివాదాస్పదంగా మారింది.. ఉడత వల్లే హై టెన్షన్‌ విద్యుత్‌ వైరు తెగిపోవడం ఏంటి? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.