టీడీపీ ప్రభుత్వ హయాంలో సంభవించిన తిత్లీ తుఫాన్ సందర్భంగా నష్టపరిహారం పంపిణీలో అవకతవకలు జరిగాయని గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై శుక్రవారం జరిగిన ఏపీ కేబినెట్‌లో కీలక చర్చ జరిగింది. తిత్లీ తుఫాన్ నష్ట పరిహారం పంపిణీపై సమగ్ర విచారణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నష్టపరిహారాన్ని రైతులకు పంపిణీ చేశామనే పేరుతో నిధులను పక్కదారి పట్టించారని గత ప్రభుత్వంపై మంత్రి వర్గం ఆరోపణలు చేసింది. మొత్తం 14,135 మంది రైతులకు రూ. 28 కోట్లు పంపిణీ చేసినట్టు లెక్కలు చూపారని.. నష్ట పరిహారం పంపిణీలో అవకతవకలపై సమగ్ర విచారణ అనంతరం రికవరీ చేసే అంశంపై నిర్ణయం తీసుకుందామని కేబినెట్ నిర్ణయించింది.
మరోవైపు జగనన్న లేఔట్లు, జగనన్న స్మార్ట్‌టౌన్‌షిప్‌లలో ప్రైవేటు భాగస్వామ్యానికి కెబినెట్ గ్రీన్ సిగ్నల్ తెలిపింది. జగనన్న లే అవుట్లల్లో ప్రైవేటు వారికి భాగస్వామ్యం కల్పించేలా రూపొందించిన డ్రాఫ్ట్ పాలసీకి కేబినెట్ ఆమోదం పలికింది. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్పుల డెవలప్‌మెంట్ నిమిత్తం ప్రైవేట్ భాగస్వాములకు 40 శాతం మేర వాటా ఇచ్చేందుకు కెబినెట్ ఆమోదం తెలిపింది. పేమెంట్ ఆఫ్ శాలరీస్, పెన్షన్స్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్ క్వాలిఫికేషన్ యాక్ట్-1953కు చట్ట సవరణకు కెబినెట్ ఆమోదం పలికింది. అటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా మల్లాది విష్ణు నియామకానికి అడ్డంకులు తొలగిపోయాయి. మల్లాది విష్ణును ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది.
Minister Venu Gopala Krishna: కొత్త జిల్లాలు ఏర్పడినా.. వాళ్లే కొనసాగుతారు..!!