Site icon NTV Telugu

APCPDCL: ఆఫీసుల్లో ఫోన్‌లు వాడొద్దు.. ఉద్యోగులకు ఏపీసీపీడీసీఎల్ ఆదేశాలు

Mobile Talking

Mobile Talking

APCPDCL: ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ (ఏపీసీపీడీసీఎల్) ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కార్యాలయాల్లో మొబైల్ ఫోన్‌లు వాడొద్దంటూ ఉద్యోగులందరికీ మెమో జారీ చేసింది. అక్టోబరు 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. డిస్కంల ఉద్యోగులు పని వేళ్లలో సమయాన్ని వృథా చేస్తున్నారని, రోజువారీ పనిని వాయిదా వేస్తున్నారని ఈ నెల 19న విడుదల చేసిన మెమోలో ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మాజనార్ధన్‌ రెడ్డి పేర్కొన్నారు. పనిని వాయిదా వేయడం వల్ల పేరుకుపోతోందని అభిప్రాయపడ్డారు. పని గంటలు వృథా కాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఒకవేళ ఉద్యోగులు అత్యవసరంగా మాట్లాడాల్సి వస్తే మాత్రం వాళ్ల పైఅధికారి ఫోన్ నంబరు ఇవ్వాలని ఉద్యోగులకు సూచించారు. సీజీఎం, సూపరింటెండెంట్ ఇంజినీర్లు కిందిస్థాయిలో ఈ ఆదేశాలు జారీ చేయాలని సీఎండీ పేర్కొన్నారు.

Read Also: Supreme Court: రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట కేసు.. హీరో షారుఖ్‌ఖాన్‌కు ఊరట

కంప్యూటర్ ఆపరేటర్లు, ఆఫీసు సబార్డినేటింగ్ అధికారులు, రికార్డు అసిస్టెంట్లు, టైపిస్టులు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఆఫీసు పనివేళల్లో సెల్‌ఫోన్లు ఉపయోగిస్తూ పనిగంటలు వృథా చేస్తున్నారని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మాజనార్ధన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఉద్యోగులు పనిగంటలు వృథా కాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ మేరకు అక్టోబరు 1 నుంచి ఉద్యోగులు కార్యాలయానికి వచ్చిన వెంటనే తమ ఫోన్లను డిపాజిట్ చేసి రసీదు తీసుకోవాలని సూచించారు. భోజన విరామ సమయంలో మాత్రం వాడుకునేందుకు అవకాశం ఉంటుందని, ఈ మేరకు యాజమాన్యం నిర్ణయం తీసుకుందని పద్మాజనార్దనరెడ్డి పేర్కొన్నారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించే ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Exit mobile version