NTV Telugu Site icon

ఏపీ టూరిజం కొత్త ఆలోచన.. శిల్పారామాల ద్వారా ఆదాయానికి ప్లాన్ లు !

శిల్పారామాల ద్వారా ఆదాయ సముపార్జనకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది ఏపీ టూరిజం. స్పెషల్‌ సీఎస్‌ రజత్ భార్గవ అధ్యక్షతన జరిగిన శిల్పారామాల ఎగ్జిక్యూటీవ్ బాడీ సమావేశంలో కీలక చర్చలు జరిగాయి. ఆదాయ సముపార్జనకు ఖాళీగా ఉన్న శిల్పారామాల భూముల వినియోగానికి కసరత్తులు చేస్తున్నారు. శిల్పారామాల భూముల్లో హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, స్పోర్ట్సు కాంప్లెక్సుల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. పీపీపీ పద్ధతిలో గుంటూరు, కాకినాడ, కడప, అనంతపురంలో శిల్పారామాల్లో హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, స్పోర్ట్సు కాంపెక్సుల నిర్మాణాలకు ఎగ్జిక్యూటివ్ బాడీ ఓకే చెప్పింది.

వీలైనంత త్వరగా మిగిలిన శిల్పారామం భూముల్లోనూ పీపీపీ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రణాళికలు అందచేయాలని రజత్‌ భార్గవ సూచించారు. శిల్పారామాల భూముల్లో డీఆర్డీయే, లేపాక్షి, ఆప్కో, డ్వాక్రా సంఘాల స్టాళ్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. స్టాళ్లను నిర్మించి డ్వాక్రా సంఘాలకు ఉచితంగా అందజేయాలని నిర్ణయం తీసుకుంది. శ్రీకాకుళం, అనంతపురం శిల్పారామాల అభివృద్ధి మాస్టర్ ప్లాన్‌ను ఎగ్జిక్యూటీవ్ బాడీ అంగీకరించింది.