Site icon NTV Telugu

Tammineni Sitaram: ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే విశాఖ రాజధాని కావాలి

Tanmineni Sitharam

Tanmineni Sitharam

Tammineni Sitaram: శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ రాజధాని సాధన ఐక్య వేదిక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే విశాఖ రాజధానిగా రావాలని అభిప్రాయపడ్డారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుకు చరిత్ర ఉందని.. నాడు ప్రజల తీవ్రమైన భావావేశాన్ని ప్రదర్శించి గట్టిగా అడిగారన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, జీవించే హక్కు కోసం నాడు ఉద్యమాలు జరిగాయని స్పీకర్ తమ్మినేని తెలిపారు. పాదయాత్రలో పేదరికాన్ని గమనించిన జగన్ ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.

Read Also: Bharat Jodo Yatra: రాహుల్ పాదయాత్రలో అపశృతి.. మాజీ మంత్రికి తీవ్రగాయాలు

ఉత్తరాంధ్ర ప్రాంతంలో వెనుకబాటు పోవాలంటే విశాఖ రాజధాని కోసం న్యాయమూర్తులు తీర్పులు ఇవ్వాలని వేడుకుంటున్నామని తమ్మినేని సీతారాం అన్నారు. మళ్లీ వేర్పాటు వాదం ఉండకూడదంటే వికేంద్రీకరణ జరగాలని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ చేపట్టామన్నారు. విశాఖ రాజధాని కావడం ఉత్తరాంధ్ర కల అని.. భవిష్యత్ తరాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. అమరావతి ఏర్పాటు కోసం 30వేల ఎకరాలు తీసుకోవడం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమేనని తమ్మినేని సీతారాం విమర్శించారు. వికేంద్రీకరణకు మద్దతు ఇవ్వకపోతే నష్టపోతామని.. ఉత్తరాంధ్ర వాసులు చరిత్ర హీనులు కాకూడదని వ్యాఖ్యానించారు. మన ఆలోచన, మన గమ్యం, మన లక్ష్యం కూడా విశాఖపట్నం రాజధాని కావాలని ఆకాంక్షించారు. ఫాల్స్ ప్రెస్టేజ్‌కు పోకుండా ఉత్తరాంధ్రలోని అన్ని రాజకీయ పార్టీలు ఇందుకోసం కలసిరావాలని పిలుపునిచ్చారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకుంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతామన్నారు. అదును, పదును రెండూ జగన్ ఇచ్చారని.. కనుక ఈ అంశంలో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. రాజధాని ఒక్కటైతే వద్దని.. మూడైతే ముద్దని అన్నారు.

Exit mobile version