Site icon NTV Telugu

Ap New DGP: బాధ్యతలు తీసుకోనున్న రాజేంద్రనాథ్… మార్క్ చూపిస్తారా?

ఏపీ పాలనపై ఫోకస్ పెట్టిన జగన్ అందులో భాగంగా పోలీస్ బాస్ ని మార్చారు. డీజీపీగా వున్న గౌతమ్ సవాంగ్ ని బదిలీ చేశారు. కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీకి నియమించిన సంగతి తెలిసిందే. ఇవాళ డీజీపీగా బాధ్యతలు తీసుకోనున్నారు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి. మంగళగిరిలోని పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఉదయం 9 గంటలకు బాధ్యతలు తీసుకోనున్నారు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి. అనంతరం పాత డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఘనంగా వీడ్కోలు వేడుక నిర్వహిస్తారు.

డీజీపీగా వున్న గౌతమ్ సవాంగ్ ని హఠాత్తుగా ఎందుకు బదిలీచేశారనేది అంతా చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టు ఒక తీర్పు ప్రకారం డీజీపీకి పదవీకాలం కనీసం రెండేళ్లు ఉండాలి. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గంటల్లోనే అప్పటి డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌ని తొలగించి సవాంగ్‌ను నియమించారు. సవాంగ్ రెండేళ్ల కాలం పూర్తి చేశారు. రెండేళ్ల కాలం పూర్తిచేశాక డీజీపీని బదిలీ చేసేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంది.
దీనిని ఎవరూ కాదనరు. కానీ డీజీపీని బదిలీ చేసేందుకు ఒక ప్రక్రియ ప్రారంభించాలి.

గౌతమ్ సవాంగ్-జగన్ మధ్య మంచి సంబంధాలే వున్నాయి. ఆయనను ముఖ్యమంత్రి ‘అన్నా’ అని ఎంతో చనువుగా పిలిచేవారని చెబుతారు. అంతేకాదు, ఆయనకు ముఖ్యమంత్రి దగ్గర ఎంత చనువుందంటే, నేరుగా తలుపు తీసుకుని ముఖ్యమంత్రి ఆఫీస్‌లోకి వెళ్లే అంత చనువు వుందంటారు. కానీ ఎక్కడో తేడా కొట్టింది. రాజకీయనేతలతో ఎంతో సన్నిహితంగా మెలిగే ఉన్నతాధికారులు ఎక్కువ కాలం అలా సాగలేరని స్వయాన పాలనాధికారులే చెబుతున్నారు. జగన్-సవాంగ్ పనితీరుపై విమర్శలు చేశాయి విపక్షాలు. ఆయనెప్పుడూ డీజీపీగా పనిచేయలేదని టీడీపీ నేతలు బాహాటంగా విమర్శించారు.

ఎంతో విధేయతతో పనిచేసే సవాంగ్ బదిలీ వెనుక జగన్ వ్యూహమే వుందంటున్నారు. గతంలో తెలంగాణ తరహాలోనే ఆంధ్రప్రదేశ్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని కూడా పత్రికలు రాస్తున్నాయి. వచ్చే ఏడాది మధ్యలోనే ఎన్నికలకు వెళ్ళే అవకాశం వుందంటున్నారు. గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ 2018లోనే ముందస్తుకి వెళ్లి మరోసారి సీఎం పీఠం అధిరోహించారు. అదే తరహాలో జగన్ వెళతారని అంటున్నారు. ఎన్నికలకు అందరినీ సమాయత్తం చేయడం కోసం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని, కొత్త డీజీపీని తీసుకురావడం అందులో భాగం అంటున్నారు.

ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ గా వున్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి(1992 బ్యాచ్)ని డీజీపీగా తీసుకోవాలని ఎప్పుడో నిర్ణయం అయింది. దానికి తోడు ఆయన కడప జిల్లా ప్రొద్దుటూరుకి చెందిన వ్యక్తి. డిపార్ట్‌మెంట్ మీద ఆయనకు గ్రిప్ రావాలంటే ఇప్పుడే నియామకం జరగాలని జగన్ వ్యూహం. అందుకే గౌతమ్ సవాంగ్ ని పంపేశారు. దీనికి తోడు ఛలో విజయవాడ సందర్భంగా డీజీపీ వ్యవహరించిన తీరుపై కూడా జగన్ అసహనంతో వున్నారు. అందుకే ఆయన్ని హఠాత్తుగా బదిలీ చేశారని అంటున్నారు. కొత్త బాధ్యతల్లో రాజేంద్రనాథ్ రెడ్డి ఎలా ఒదిగిపోతారో చూడాలి మరి.

https://ntvtelugu.com/sajjala-ramakrishna-reddy-fires-on-chandrababu-over-ys-vivekananda-reddy-murder-case/
Exit mobile version