AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!

  • ఏపీ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు
  • నవంబర్ 1న పోలింగ్.. 3న కౌంటింగ్
  • నాలుగు పట్టణాల్లో మళ్లీ నామినేషన్లు
  • అక్టోబర్ 25న పత్రాల పరిశీలన
Ap Elections

Ap Elections

ఆంధ్రప్రదేశ్‌లో జరగాల్సిన మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం (APSEC) సవరించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియలో కీలక మార్పులు చేస్తూ కొత్త తేదీలను ప్రకటించింది. వాస్తవానికి ఈ నెల 28న జరగాల్సిన పోలింగ్‌ను నవంబర్ 1వ తేదీకి వాయిదా వేయగా, నవంబర్ 3న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ఎదుర్కొన్న అడ్డంకులు, దాడుల ఘటనలను పరిగణలోకి తీసుకుని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల అనుగుణంగా ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఎంపిక చేసిన 4 పట్టణ స్థానిక సంస్థల్లో నామినేషన్లకు మళ్లీ అవకాశం

అభ్యర్థులకు నామినేషన్లు వేయడంలో ఇబ్బందులు ఎదురైనట్లు గుర్తించిన నాలుగు ప్రధాన పట్టణ స్థానిక సంస్థలలో (ULBs) నామినేషన్ల గడువును 48 గంటల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. దీని ప్రకారం కడప మున్సిపల్ కార్పొరేషన్‌లో కొన్ని నిర్దిష్ట వార్డులతో పాటు, రాజంపేట మున్సిపాలిటీ, మైదుకూరు మున్సిపాలిటీ , తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌లోని పలు వార్డులకు సంబంధించి అక్టోబర్ 23 , 24 తేదీలలో ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. గతంలో నిర్ణయించిన కేంద్రాలతో పాటు కలెక్టరేట్ ప్రాంగణాల్లోనూ ఈ నామినేషన్లను దాఖలు చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.

సవరించిన మున్సిపల్ ఎన్నికల పూర్తి షెడ్యూల్ వివరాలు

కొత్తగా నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల పత్రాల పరిశీలన అక్టోబర్ 25న ఉదయం 8:00 గంటల నుండి ప్రారంభమవుతుంది. అదే రోజు మధ్యాహ్నం 3:00 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఆ తర్వాత అదే రోజు మధ్యాహ్నం 3:00 గంటల తరువాత తుది అభ్యర్థుల జాబితాను ప్రచురిస్తారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 1న ఉదయం 7:00 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఒకవేళ ఎక్కడైనా రీ-పోలింగ్ అవసరమైతే నవంబర్ 2న నిర్వహించి, నవంబర్ 3న ఉదయం 8:00 గంటల నుండి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. మున్సిపల్ ఎన్నికల తేదీలు మారిన నేపథ్యంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తేదీలపై కూడా త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.