AP Minister RK Roja Says War One Side In AP Elections: ఏపీ మంత్రి రోజా మరోసారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేనాధినేత పవన్ కళ్యాణ్‌పై ధ్వజమెత్తారు. ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల్లో ముంచేశారని మండిపడిన ఆమె.. కాపులకు చంద్రబాబు చేసింది అక్రమ కేసులు, లాఠీ దెబ్బలు, అవమానాలు మాత్రమేనని విమర్శించారు. చంద్రబాబు, బీజేపీ, పవన్ కలిసొచ్చి.. ఏపీ ప్రజల్ని మోసం చేశారని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని ఎన్నికల్లోనూ వార్ సైడ్ అని తేలిపోయిందని.. రాబోయే ఎన్నికల్లోనూ చంద్రబాబు, దత్తపుత్రుడిని తరిమికొట్టాలని రోజా అన్నారు.
‘‘మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వార్ వన్ సైడ్ అని తేలిపోయింది. అందుకే చంద్రబాబు ఫ్రస్టేషన్ పీక్స్‌లో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ విషయం అర్థం కాక.. సిగ్గు లేకుండా ఎన్నికలకు రావాలని సవాల్ చేస్తున్నారు. సీఎం జగన్‌ను ప్రజలు ప్రేమగా దగ్గరికి తీసుకోవడాన్ని చంద్రబాబు సహించలేకపోతున్నారు. జగన్ బయటికొస్తే.. ప్రజల్లో వస్తున్న అభిమానం చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా పద్దతి మార్చుకోకపోతే.. ప్రజలు తిరగబడే రోజు వస్తుంది’’ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తమ పార్టీనే అఖండ విజయాన్ని నమోదు చేస్తుందని మంత్రి రోజా పేర్కొన్నారు.
