NTV Telugu Site icon

పేద, మధ్య తరగతి వర్గాల కోసం కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం..!

సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన ఇవాళ ఏపీ కేబినెట్‌ సమావేశమైంది.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది కేబినెట్‌.. ఇక, కేబినెట్‌ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి పేర్ని నాని.. తీసుకున్న నిర్ణయాలను విరించారు.. పేద, మధ్య తరగతి వర్గాల కోసం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం అన్నారు.. రైతులకు ఉదయం 9 గంటల పాటు ఉచిత విద్యుత్ కోసం 10 వేల మెగావాట్ల విద్యుత్‌ను యూనిట్ రూ.2.49కు 30 ఏళ్ల పాటు ఇచ్చేందుకు కేంద్ర సోలార్ కార్పొరేషన్ ముందుకు వచ్చిందని.. దీనికి మంత్రి మండలి ఆమోద ముద్ర వేసిందన్నారు.. కేంద్ర సోలార్ కార్పొరేషన్ ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందిస్తు లేఖ రాసిందని ఈ సందర్భంగా వెల్లడించిన మంత్రి.. మాజీ సీఎం చంద్రబాబు చేసిన పాపం, అవినీతినే ట్రూ అప్ ఛార్జీల పేరుతో రాష్ట్రం భరించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

ఇక, మైనార్టీ సబ్ ప్లాన్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.. మైక్రోసాఫ్ట్ సహకారంతో 1.62 లక్షల మంది విద్యార్ధులకు స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.. 300 కాలేజీలు, స్కిల్ డెవలప్‌మెంట్‌ సెంటర్లలో శిక్షణ ఇవ్వనుంది మైక్రోసాఫ్ట్.. 40 సర్టిఫికేషన్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు.. రూ. 30.79 కోట్లతో మైక్రో సాఫ్ట్ ప్రాజెక్టు అమలుకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. డ్రగ్స్ అండ్ కాస్మటెక్స్ చట్టానికి సవరణలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.. నకిలీ, ప్రజలకు హాని చేసే మందులు అమ్మేవారిపై చర్యలు తీసుకునే అవకాశం ఈ చట్ట సవరణ ద్వారా కలగనుంది.. మరోవైపు.. గుంటూరు జిల్లాలోని 230 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీఎమ్డీసీకి బదిలీ చేయాలని నిర్ణయం తీసుకుంది కేబినెట్‌.. ఆ భూముల్లో ఇప్పటికే ఉన్న పేదవారికి నష్టపరిహారం ఇచ్చిన తర్వాతే బదలాయింపు ప్రక్రియ చేపట్టాలని ఆదేశించింది.. 1983 నుంచి 2011 వరకు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ దగ్గర ఇంటి పట్టాలు కుదువ పెట్టి తెచ్చుకున్న అప్పును ఒన్ టైం సెటిల్ మెంట్ పథకం అమలు చేయాలని కేబినెట్‌ తీర్మానం చేసినట్టు వెల్లడించార మంత్రి పేర్నినాని.. పేద, మధ్య తరగతి వర్గాల కోసం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామన్న ఆయన.. దీని వల్ల 46 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు.. గ్రామీణ ప్రాంతాల్లో 10 వేలు, మున్సిపాలిటీల్లో 15 వేలు, నగరాల్లో 20 వేలు కట్టి రుణ విముక్తులు అవ్వొచ్చని సూచించారు. ఈ ఏడాది డిసెంబర్ 21లోపు ఈ పథకాన్ని ఉపయోగించుకునే సౌలభ్యం ఉందని తెలిపిన మంత్రి.. అసలు, వడ్డీ కలిపి రూ.14 వేల 600 కోట్లు ఒన్ టైం సెటిల్ మెంట్ కింద అమలు చేస్తామన్నారు.. ఇక, 31 లక్షల మందికి సొంత ఇంటి స్థలం కేటాయించామని.. వీరికి బ్యాంకుల నుంచి 9 శాతం వడ్డీకి 35వేలు రుణ సదుపాయం కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని.. దీనిలో 6 శాతం వడ్డీ ప్రభుత్వం బరిస్తుందన్నారు. ఒక్క పోలీసు స్టేషన్‌లేని ఏకైక మండలం కాసినాయన మండలంలో ఒక లా అండ్ ఆర్డర్ పోలీసు స్టేషన్, సిబ్బంది ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందని.. ఏపీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. ఇక, రెవెన్యూ డివిజన్ గా బద్వేలు ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసిందని వెల్లడించారు మంత్రి పేర్నినాని.