Site icon NTV Telugu

Minister Botsa: పన్నులు కట్టకపోతే ఆస్తుల జప్తు.. ఇవాళ కొత్తగా వచ్చిందా..?

కరెంట్‌ బిల్లు కట్టకపోతే కరెంట్‌ కట్‌ చేయడం.. ఆస్తి పన్ను కట్టకుంటే ఆస్తులు జప్తు చేయడం.. ఇలా పలు రకాల పన్నుల విషయంలో.. అధికారులు తీసుకుంటున్న చర్యలు కొత్తకాకపోవచ్చు.. కానీ, చెత్త పన్ను, ఆస్తి పన్ను పేరిట అధికారుల వేధింపులు పెరిగిపోయాయని.. పన్నుల వసూలు పేరిట జనం పట్ల అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నారని.. చెత్త పన్ను కట్టలేదంటూ కర్నూలు జిల్లాలో దుకాణాల ముందు చెత్త వేయడం.. ఆస్తి పన్ను కట్టకుంటే ఆస్తులు జప్తు చేస్తామంటూ ప్రచారం చేయడం.. కరెంట్‌ బిల్లు వంకతో కరెంట్‌ కట్‌ చేయడం లాంటి చర్యలకు దిగుతున్నారంటూ ఆరోపణలు ఉన్నాయి.. ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ.. ఈ విధానం ఇవాళ కొత్తగా వచ్చిందా? అని ప్రశ్నించారు.

Read Also: Ukraine Russia War: చర్చలు విఫలమైతే.. మూడో ప్రపంచ యుద్ధమే..!

అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ.. కరెంట్ బిల్లు కట్టకపోతే కరెంట్ తీసేస్తామనటం తప్పు అంటే ఎలా? అని ప్రశ్నించారు.. ఆస్తుల జప్తు ఇవాళ కొత్తగా వచ్చిన అంశం కాదన్న ఆయన.. పన్నులు కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తామని చెప్పటం తప్పు అంటే ఎలా? అని నిలదీశారు.. గత ప్రభుత్వాలు చేసినప్పుడు ఎందుకు ఈ విధానాన్ని ప్రశ్నించలేదు? అని మండిపడ్డ ఆయన.. కానీ, జప్తు చేయటం మా ఉద్దేశ్యం కాదు.. పన్నులు కట్టకపోతే స్థానిక సంస్థలు ఎలా బలోపేతం అవుతాయి? అని ప్రశ్నించారు. పన్ను కట్టకపోతే నోటీసులు ఇవ్వొచ్చు… కానీ, ఇంటికి తాళాలు వేయటం కరెక్ట్ కాదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.

Exit mobile version