Site icon NTV Telugu

Minister Appalaraju: అది అమరావతి కాదు.. ‘కమ్మ’రావతి..

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీర్పు తర్వాత.. రాజధాని అమరావతి మరోసారి తెరపైకి వచ్చింది.. అయితే, తాము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాం.. అదే తమ విధానం అంటూ స్పష్టం చేస్తోంది అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఇక, అమరావతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి అప్పలరాజు.. అతి అమరావతి కాదు కమ్మరావతి అని దుయ్యబట్టారు. మూడు రాజధానులకు చంద్రబాబు అడ్డుకుంటున్నారంటూ ధ్వజమెత్తిన ఆయన.. ప్రతివిషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు కోర్టుకెళ్లి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. సీఆర్‌డీఏ రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని హైకోర్టు చెప్పిందని గుర్తుచేశారు. కానీ, తమ విధానం వికేంద్రీకరణ అని స్పష్టం చేశారు.. ఎన్ని అడ్డంకులు వచ్చినా మూడు రాజధానులపై సీఎం వైఎస్‌ జగన్ ముందుకెళ్తున్నారన్న ఆయన.. ఉత్తరాంధ్రకు రాజధాని రాకుండా.. అడ్డుపడుతున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలంటూ పిలుపునిచ్చారు.

Read Also: Petrol Price: టెన్షన్‌ పెడుతోన్న తాజా నివేదిక.. రూ.15-22 పెరగనున్న పెట్రో ధరలు..!

అభివృద్ధి వికేంద్రీకరణ శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికలోనే ఉందన్నారు మంత్రి అప్పలరాజు.. రాజధానిని వికేంద్రీకరించి విశాఖపట్నంలో సెక్రటేరియట్ కట్టిస్తాం తద్వారా కార్య నిర్వాహక రాజధానిని చేస్తామన్న ఆయన.. అమరావతిలో ఉన్న అసెంబ్లీని కొనసాగించి లెజిస్లేటివ్ కేపిటల్‌గా చేస్తాం.. కర్నూల్‌లో హైకోర్టును కట్టి న్యాయ నిర్వాహక రాజధానిగా రాయలసీమను చేస్తామన్నారు.. ఇక, అమరావతి నిర్మాణానికి 53 వేల ఎకరాలు (ప్రభుత్వ భూమితో కలిపి) చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ చేశారన్న ఆయన.. భూములిచ్చిన రైతులకు ప్రతి సంవత్సరం పరిహారం ఇవ్వాలట.. ఇది చంద్రబాబు స్కీమ్ కాదు స్కామ్‌ అంటూ ఆరోపణలు గుప్పించారు.. రియల్ ఎస్టేట్ కారణంగా 5 లక్షల ఎకరాల భూములు పనికి రాకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన… మూడు రాజధానుల కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. వికేంద్రీకరణ, మూడు రాజధానులే తమ విధానమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బలంగా చెబుతున్నారు.. జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి మద్దతు పలకాలన్నారు.. వికేంద్రీకరణ ముద్దు… కమ్మరావతి వద్దు అని మంత్రి అప్పలరాజు ఈ సందర్భంగా నినాదాలు చేశారు..

Exit mobile version