Patapati Sarraju Passed Away: శివరాత్రి సమయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో విషాదం నెలకొంది.. ఏపీ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్, ఉండి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు గత అర్ధరాత్రి కన్నుమూశారు.. ఆయన వయస్సు 72 సంవత్సరాలు. భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 2004 ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు.. ఇక, 2009లో మళ్లీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు.. ఆ తర్వాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు పాతపాటి సర్రాజు.. 2014లో వైసీపీ అభ్యర్థిగా ఉండి నుంచి పోటీ చేసినా ఓటమి తప్పలేదు.. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. అయితే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి.. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత పాతపాటి సర్రాజును ఏపీ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు..
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
శుక్రవారం రాత్రి భీమవరంలో ఓ వివాహ వేడుకకు హాజరైన పాతపాటి సర్రాజు.. రాత్రి 10 గంటల తర్వాత తన నివాసానికి చేరుకున్నారు.. అయితే, ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలారు. వెంటనే అప్రమత్తమై.. ఆయనను భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.. ఆయన, 1954లో కాళ్ల మండలం జక్కవరం గ్రామంలో జన్మించారు. కాంగ్రెస్ పార్టీలో చేరడంతో రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆయన.. ఆ తర్వాత వైసీపీలో చేరారు.. 17 జులై 2021న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. 14 ఆగష్టు 2021న ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.. ఇక, పాతపాటి సర్రాజు మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. సర్రాజు కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు భీమవరం సర్రాజు గారి స్వగృహంలో ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించనున్న సీఎం జగన్.. కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.