Site icon NTV Telugu

AP Pegasus Row: డేటా చౌర్యంపై గూగుల్ సహాయం కోరిన హౌస్ కమిటీ

Google

Google

Pegasus Row: ఏపీ అసెంబ్లీలో మంగళవారం నాడు పెగాసస్‌పై హౌస్ కమిటీ సభ ముందు నివేదికను ప్రవేశపెట్టింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన డేటా చౌర్యం వ్యవహారంపై శాసనసభకు మధ్యంతర నివేదికను ఇచ్చింది. మొత్తం 85 పేజీలతో కూడిన మధ్యంతర నివేదికను శాసనసభకు భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలోని సభా సంఘం సమర్పించింది. ఈ సందర్భంగా డేటా చౌర్యం వ్యవహారంపై వివరాల కోసం గూగుల్‌కు భూమన నేతృత్వంలోని హౌస్ కమిటీ లేఖ రాసింది. స్టేట్ డేటా సెంటర్ సర్వర్ల నుంచి గుర్తుతెలియని సర్వర్ ఐపీలకు వెళ్లిన వివరాలను ఇవ్వాల్సిందిగా గూగుల్‌ను హౌస్ కమిటీ కోరింది. అయితే సభా సంఘం పంపిన ఐపీ అడ్రస్సుల వివరాలను గుర్తించలేమని గూగుల్ సంస్థ స్పష్టం చేసింది. సదరు ఐపీ అడ్రస్సులు గూగుల్‌కు చెందినవే అయినా ప్రత్యేకంగా ఎవరికీ కేటాయించనందున గుర్తింపు కష్టమని గూగుల్ పేర్కొంది. దీనిపై తదుపరి సంప్రదింపుల కోసం తమ న్యాయవిభాగానికి ఈ-మెయిల్ పంపాలని గూగుల్ సూచించింది. డేటా చౌర్యం వ్యవహారంలో వేర్వేరు సర్వర్లలోని ఐపీ అడ్రస్‌ల జాబితాను హౌస్ కమిటీ తన నివేదికలో పొందుపర్చింది.

Read Also:Duplicate CM Arrest: సీఎం వేషధారణలో మోసం..! డూప్లికేట్‌ సీఎం అరెస్ట్..!

డేటా చౌర్యంపై సభా సంఘంలోని నివేదిక వివరాలు:
ఏపీ కంప్యూటర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ పర్యవేక్షణలో రాష్ట్రంలోని కంప్యూటర్ నెట్ వర్క్, డేటా భద్రత, సర్వర్ల వివరాలను ఇంటెలిజెన్స్ విభాగం విశ్లేషించింది.డేటా చౌర్యానికి సంబంధించిన లావాదేవీలు లాగ్స్ రూపంలో సేకరించామని తెలిపింది. రాష్ట్రంలోని 18 స్టేట్ డేటా సెంటర్ల నుంచి పెద్ద మొత్తంలో డేటా చౌర్యం జరిగిందని పేర్కొంది. 2018 నవంబర్ 30 నుంచి 2019 మార్చి 31 తేదీ వరకు ఈ డేటా చౌర్యం జరిగిందని నివేదికలో వివరించింది. అధికారిక అనుమతులు లేకుండా డేటా ట్రాన్స్‌ఫర్ జరిగిందని స్పష్టం చేసింది. రాష్ట్ర డేటా సెంటర్ సర్వర్ల నుంచి బయట సర్వర్లకు మార్పిడి జరిగిన ఈ డేటా వివరాలు, ఐపీ అడ్రస్‌లను కూడా గూగుల్ గుర్తించలేకపోయిందని హౌస్ కమిటీ నివేదికలో పొందుపరిచింది. రాష్ట్రంలోని పౌరులకు సంబంధించిన సున్నితమైన సమాచారం 2018 నవంబర్ 30 నుంచి 2019 మార్చి 31వ తేదీ మధ్య ఎస్‌డీసీ నుంచి గుర్తుతెలియని సర్వర్లకు డేటా చౌర్యం జరిగిందని తెలిపింది.

Exit mobile version