NTV Telugu Site icon

Narayana: నారాయణ కుమార్తెల ముందస్తు బెయిల్ పిటిషన్

Aphighcourt

Aphighcourt

ఏపీలో సంచలనం కలిగించిన పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ మాజీ మంత్రి పి. నారాయణ కుమార్తెలు పొంగూరు శరణి, పొంగూరు సింధూర, అల్లుడు పునీత్‌తోపాటు నారాయణ విద్యాసంస్థలకు చెందిన మరో 10 మంది హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వీరికి హైకోర్టులో ఊరట లభించింది. తమకు ముందస్తు బెయిలు ఇవ్వాలంటూ వేసిన పిటిషన్ పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మథరావు ఈ వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ జరిపారు. పిటిషనర్లపై ఈ నెల 18వ తేదీ వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్వర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణను మే 18వ తేదీకి వాయిదా వేశారు. దీంతో నారాయణ కుటుంబ సభ్యులు, విద్యాసంస్థల సిబ్బందికి ఊరట లభించినట్టయింది.

పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో చిత్తూరు డీఈవో ఫిర్యాదు మేరకు చిత్తూరు వన్‌టౌన్ పోలీసులు నారాయణ విద్యాసంస్థలపై కేసు నమోదు చేశారు. అనంతరం ఈ నెల 10వ తేదీన హైదరాబాద్‌లో ఉన్న నారాయణను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే. తనకు ఈ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని నారాయణ తరఫు న్యాయవాది వాదించారు. నారాయణ విద్యాసంస్థల చైర్మన్ పదవి నుంచి నారాయణ 2014లోనే తప్పుకున్నట్టు ఆయన తరపు న్యాయవాది కోర్టుకు ఆధారాలు చూపించడంతో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

ఈ కేసులో పోలీసులు తమను అరెస్ట్ చేసే అవకాశం ఉందని భావించిన నారాయణ కుటుంబ సభ్యులతోపాటు విద్యాసంస్థలకు చెందిన జాలిపర్తి కొండలరావు, మాలెంపాటి కిశోర్‌, రాపూరు కోటేశ్వరరావు, వీపీఎన్‌ఆర్‌ ప్రసాద్‌, వి.శ్రీనాథ్‌, రాపూరు సాంబశివరావు, వై.వినయ్‌కుమార్‌, జి.సురేశ్‌కుమార్‌, ఎ.మునిశంకర్‌, బి.కోటేశ్వరరావు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తమకు మాల్‌ప్రాక్టీస్‌తో సంబంధం లేదని, పోలీసులు నమోదు చేసిన కేసులో తమను నిందితులుగా పేర్కొనలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులకు దిగువ కోర్టు బెయిల్‌ మంజూరు చేసిందని, కాబట్టి ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని పిటిషనర్లకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలంటూ వారి తరపు న్యాయవాది అభ్యర్థించారు.

దీనిపై స్పందించిన న్యాయస్థానం పిటిషనర్లు అసలు నిందితులే కానప్పుడు వారికి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే నష్టం ఏమిటని ప్రశ్నించింది. ఈ నెల 18 (బుధవారం) వరకు పిటిషనర్లపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని జస్టిస్ మన్మథరావు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసు మే 18 తర్వాత ఏం మలుపులు తిరుగుతుందో చూడాలి.

BJP K Laxman : హరీష్ రావుకు అబద్దాల లో అవార్డు ఇవ్వవచ్చు