Site icon NTV Telugu

సినిమా థియేటర్‌ను సీజ్ చేసే అధికారం తహసీల్దార్‌కు లేదు: హైకోర్టు

ఏపీలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుందన్న కారణంతో ఓ సినిమా థియేటర్‌ను తహసీల్దార్ సీజ్ చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. సినిమా థియేటర్‌ను సీజ్ చేసే అధికారం తహసీల్దార్‌కు లేదని ఈ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. నిబంధనలు పాటించని కారణంగా శ్రీకాకుళం జిల్లా సోంపేటలోని శ్రీనివాసమహల్ థియేటర్‌ను సీజ్ చేస్తున్నట్లు గతంలో తహసీల్దార్ ప్రకటించారు. అయితే తహసీల్దార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ థియేటర్ యజమాని శంకర్‌రావు హైకోర్టును ఆశ్రయించాడు.

Read Also: ఏపీకి కేంద్రం శుభవార్త.. రూ.26వేల కోట్లతో విశాఖ రిఫైనరీ విస్తరణ

ఈ పిటిషన్‌ను సోమవారం నాడు హైకోర్టు విచారించింది. థియేటర్ సీజ్‌పై ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. టెక్కలి సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ థియేటర్‌ను సీజ్ చేశారని వివరించారు. అయితే ఆ వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. లైసెన్స్ జారీ చేసే అధికారం ఉన్న జాయింట్ కలెక్టర్‌కు మాత్రమే థియేటర్‌ను సీజ్ చేసే అధికారం ఉంటుందని న్యాయమూర్తి తెలిపారు. దీంతో మూసిన థియేటర్‌ను తక్షణమే తెరవాలని.. లైసెన్స్ పునరుద్ధరణ వ్యవహారం అధికారుల వద్ద ఉన్న నేపథ్యంలో సినిమాలు ప్రదర్శించుకోవచ్చని కోర్టు సూచించింది.

Exit mobile version