Site icon NTV Telugu

High Court: అక్కినేని నాగార్జునకు ఏపీ హైకోర్టు నోటీసులు.. కారణం ఇదే..!!

Bigg Boss Nagarjuna

Bigg Boss Nagarjuna

High Court: తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ ఆరో సీజన్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ షో మధ్యలోనే ఆగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. బిగ్‌బాస్ షోలో అశ్లీలత ఎక్కువగా ఉందని, ఫ్యామిలీతో కలిసి ఈ షోను చూసే పరిస్థితి లేదని ఆరోపిస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ అనంతరం ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నాగార్జునతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలంటే ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ పిటిషన్‌పై హైకోర్టు రెండు దఫాలుగా విచారణ జరిపింది.

Read Also: Ram Gopal Varma: ఏపీ రాజకీయాల నేపథ్యంలో వర్మ రెండు సినిమాలు

కాగా గతంలో జరిగిన విచారణలో భాగంగా బిగ్ బాస్ తెలుగు షోపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కనీసం రెండు లేదా మూడు ఎపిసోడ్‌లను చూస్తామని ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసం స్పష్టం చేసింది. బిగ్ బాస్ యువతను తప్పుదోవ పట్టించడంతోపాటు అసభ్యత, హింసను ప్రోత్సహిస్తోందని.. వెంటనే బిగ్ బాస్ షోను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని సామాజిక కార్యకర్త కె.జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అటు సీపీఐ నేత నారాయణ కూడా పలుమార్లు బిగ్‌బాస్ షోపై ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ రియాల్టీ షోను వీక్షిస్తామని హైకోర్టు పేర్కొంది. ఈరోజు జరిగిన విచారణ సందర్భంగా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు రెండు వారాలకు విచారణకు వాయిదా వేసింది. రెండు వారాల తర్వాత హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Exit mobile version