AP High Court: ప్రముఖ హీరో మంచు మోహన్‌బాబు, ఆయన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్‌లకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. 2019 ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా మోహన్‌బాబు, ఆయన కుమారులు తిరుపతిలో ధర్నా నిర్వహించారు. అయితే ఈ ధర్నాపై అప్పటి పోలీసులు పలు కేసులు నమోదు చేయగా.. వీటిపై తిరుపతి కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ విచారణను నిలిపివేయాలని కోరుతూ ఇటీవల మోహన్‌బాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు తాము నిర్వహించిన ధర్నాపై తిరుపతి కోర్టులో జరుగుతున్న విచారణను నిలిపివేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు.
Read Also:Kashmir: 30 ఏళ్ళ తరువాత కశ్మీర్ థియేటర్లో వేసిన మొట్ట మొదటి సినిమా ఏదంటే..?
మోహన్‌బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం నాడు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వాద, ప్రతివాదనలను విన్న హైకోర్టు తిరుపతి కోర్టులో జరుగుతున్న విచారణను 8 వారాల పాటు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా చంద్రబాబు హయాంలో ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించలేదని నిరసిస్తూ 2019 మార్చి 22న మోహన్‌బాబుతో పాటు ఆయన ఇద్దరు కుమారులు తిరుపతి-మదనపల్లి జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. అయితే ఆ సమయంలో సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో మోహన్‌బాబు, విష్ణు, మనోజ్, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల ఏవో తులసినాయుడు, పీఆర్వో సతీష్‌లపై చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ధర్నాకు పోలీసుల అనుమతి తీసుకోలేదని.. వాహనదారులకు ఇబ్బంది కలిగించారని పోలీసులు ఆరోపించారు.