నర్సాపురం ఎంపీ, వైసీపీ రెబల్ నేత రఘురామ కృష్ణంరాజు వ్యవహారం ఇప్పుడు ఏపీలో కాకరేపుతోంది.. విచారణ, అరెస్ట్.. కోర్టులో విచారణతో పాటు.. రాజకీయ విమర్శలు హీటు పెంచుతున్నాయి.. అయితే. ఒక రకంగా ప్రభుత్వం చట్టపరంగా రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ చేసి రక్షించినట్టేనని వ్యాఖ్యానించారు ప్రభుత్వ విప్ కె. శ్రీనివాసులు.. లేదంటే ప్రజలే చెప్పులు, రాళ్లతో కొట్టి రఘురామను తరిమేసే పరిస్థితి ఉండేదన్నారు. ఇక, గెలిచినప్పటి నుంచి తన నియోజకవర్గాన్ని రఘురామ కృష్ణంరాజు గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. నీతి, నియామం ఉంటే రాజీనామా చేసి మాట్లాడాలని డిమాండ్ చేశారు.. రఘురామ కృష్ణంరాజు కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవలేడని ఎద్దేవా చేసిన శ్రీనివాసులు.. పనికి మాలిన వ్యక్తి పై కక్ష సాధింపు చేసే అవసరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఎందుకు ఉంటుంది? అని ప్రశ్నించారు. మరోవైపు.. రఘురామ కృష్ణంరాజును అరెస్ట్ చేస్తే చంద్రబాబుకు, కొన్ని మీడియా ఛానళ్ళకు ఎందుకు అంత ప్రేమ? అంటూ ఫైర్ అయ్యారు. రఘురామ కృష్ణంరాజు మాటల వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు ప్రభుత్వ విప్ శ్రీనివాసులు.