NTV Telugu Site icon

JC Kishore Kumar: మంచివాడే కానీ.. రీకాల్ చేసిన సర్కార్

విజయనగరంలో అధికారుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయా ? ధరల నియంత్రణతో మంచి పేరు తెచ్చుకున్న అధికారికి…అవినీతి ఆరోపణలు చుట్టుముట్టాయా? వ్యవహారానికి పుల్‌స్టాప్‌ పెట్టేందుకు ప్రభుత్వమే రంగంలోకి దిగింది.

విజ‌య‌న‌గ‌రం జిల్లా జాయింట్ క‌లెక్టర్ సిహెచ్ కిషోర్ కుమార్. రెవెన్యూ విభాగానికి అధిప‌తి. జ‌న‌వ‌రి 2020 లో జాయింట్ క‌లెక్ట‌ర్ గా బాధ్యత‌లు చేప‌ట్టారు. వ‌చ్చిన తొలినాళ్లలో మంచి ప‌ని వాడ‌న్న ముద్ర వేసుకున్నారు. లాక్‌డౌన్‌లో నిత్యావ‌స‌రాల ధ‌ర‌లను… ప్రజ‌ల‌కు అందుబాటులో ఉండేలా ఓపెన్‌ మార్కెట్లను ఏర్పాటు చేశాడు. ఉన్నతాధికారులతో మంచి పేరు తెచ్చుకున్నారు. మార్కెట్ లో ఆక‌స్మిక త‌నిఖీలు నిర్వహించి వ్యాపారుల్లో ద‌డ పుట్టించారు. అక్రమ నిల‌్వలు ఉంటే స‌హించేది లేద‌ని హెచ్చరించ‌డంతో ప్రజ‌లు హ‌ర్షించారు. ఇవ‌న్నీ ఆయ‌న‌కు చిక్కుల తెచ్చిపెట్టాయి. కొంద‌రు అధికారులు కిశోర్‌కుమార్‌ను టార్గెట్ చేస్తూ హేళన చేసేవారు.

మంచి అధికారిగా గుర్తింపు ఉన్నప్పటికీ…అవినీతి ఆరోపణలు అదే స్థాయిలో వచ్చాయ్. దీంతో జేసీ కిశోర్‌కుమార్‌ను…ప్రభుత్వం రీకాల్ చేసింది. కొత్తవలస, భోగాపురం, పూస‌పాటి రేగ‌, డెంకాడ, విజ‌య‌న‌గ‌రం మండలాల్లో…22ఏ భూముల బదలాయింపులో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. ఇనాం, మాజీ సైనికుల‌కు ఇచ్చిన భూముల‌కు సంబంధించి బదలాయింపుల ఫైళ్లను నిబంధనల ప్రకారం గ్రామ స్థాయి వీఆర్‌వో నుంచి తహసీల్దార్‌ ద్వారా జేసీ పరిష్కరించాలి. వారి ప్రమేయం లేకుండా జేసీ నేరుగా ఆ ఫైళ్లపై సంతకాలు చేస్తున్నట్లు సమాచారం. భోగాపురం విమానాశ్రయం భూముల వ్యవహారాల్లోనూ తప్పిదాలకు పాల్పడినట్లు తెలిసింది. వీటన్నింటిపై ప్రభుత్వానికి నివేదిక వెళ్లడంతో… జేసీని రీకాల్ చేసినట్లు సమాచారం.

త‌నకున్న అధికారంతో ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా మార్చార‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఇనాం అబాలిష‌న్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వ భూముల‌ను జిరాయ‌తీగా మార్చే అధికారం జేసీకి ఉంది. దీన్నే ఆయుధంగా మార్చుకుని పెద్ద ఎత్తున ప్రభుత్వ భూముల‌ను మార్చేశార‌న్న ఆరోపణలున్నాయ్. ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌గా ఉన్న సమయంలో..భోగాపురం ఎయిర్‌పోర్టు భూములకు సంబంధించి…22 ఫైళ్లను క్లియర్‌ చేసి…కోట్లు కూడబెట్టారన్న విమర్శలు ఉన్నాయ్. దీనికి తోడు అధికారుల మధ్య విభేదాలే…జేసీ కిశోర్‌ కుమార్‌ రీకాల్‌ కారణమని కొందరు ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా ఎవరి స‌హ‌కారం లేకుండా రెవెన్యూలో ఏ ప‌ని జ‌ర‌గ‌ద‌న్నది జ‌గమెరిగిన స‌త్యం. అయితే ఇప్పుడు జాయింట్ క‌లెక్టర్‌ను రీకాల్ చేసిన ప్రభుత్వం…ఏ విధంగా ముందుకెళ్తుందో వేచి చూడాల్సి ఉంది.