Illegal Mining : అక్రమ మైనింగ్‌కు చెక్.. ఏపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు

  • ప్రతి ఫిర్యాదుకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య
  • మూడు రోజుల్లో క్షేత్రస్థాయి తనిఖీలు
  • జిల్లాల్లో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లు
  • 30 రోజుల్లో ప్రత్యేక ఐటీ పోర్టల్‌
Illegal Mining

Illegal Mining

రాష్ట్రవ్యాప్తంగా అక్రమ మైనింగ్‌, అనధికారిక తవ్వకాలు, ఖనిజాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అక్రమాలను నియంత్రించేందుకు మధ్యంతర మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకపై అక్రమ మైనింగ్‌పై వచ్చే ప్రతి ఫిర్యాదును నమోదు చేసి, మూడు పని దినాల్లో పరిశీలించాలని ఆదేశించింది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సమన్వయ బాధ్యతలు అప్పగించింది.

ప్రతి ఫిర్యాదుకూ ప్రత్యేక ఐడీ

పత్రికలు, టీవీ ఛానళ్లు, డిజిటల్ మీడియా, హెల్ప్‌లైన్లు, విజిలెన్స్ యాప్‌ ద్వారా వచ్చే ఫిర్యాదులన్నింటినీ నమోదు చేయాలి. ప్రతి ఫిర్యాదుకు ప్రత్యేక కేస్‌ ఐడీ కేటాయించాలి. గనులు, రెవెన్యూ, పోలీస్‌, అటవీ, జలవనరుల శాఖలు సంయుక్తంగా క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. భూముల యాజమాన్యం, వర్గీకరణ, భౌగోళిక కోఆర్డినేట్ల వివరాలను మూడు పని దినాల్లో అందించాలని ఆదేశించింది.

అక్రమ తవ్వకాలు నిర్ధారణ అయితే జరిమానాలు విధించడంతో పాటు వాహనాలను సీజ్‌ చేయడం, బ్లాక్‌లిస్ట్‌ చేయడం, ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం వంటి చర్యలు తీసుకోవాలి. తవ్విన ఖనిజాల పరిమాణం, ప్రభుత్వానికి జరిగిన ఆదాయ నష్టాన్ని అంచనా వేయాలి. చెల్లించని జరిమానాలను రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా వసూలు చేయాలని సూచించింది.

జిల్లాల్లో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లు

ప్రతి జిల్లాలో కలెక్టర్‌ అధ్యక్షతన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయనున్నారు. ఎస్పీ, జాయింట్‌ కలెక్టర్‌, గనులు, రెవెన్యూ, అటవీ, జలవనరుల శాఖల అధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశమై కేసుల పురోగతిని సమీక్షించాలి. కలెక్టర్లు కూడా ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాలి. తనిఖీ బృందాలకు పోలీసు రక్షణ కల్పించాలని, అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవడంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

30 రోజుల్లో ఐటీ పోర్టల్‌

ఫిర్యాదులు, తనిఖీలు, చర్యలను పర్యవేక్షించేందుకు 30 రోజుల్లో ప్రత్యేక ఐటీ పోర్టల్‌ అభివృద్ధి చేయాలని గనుల శాఖ డైరెక్టర్‌ను ఆదేశించింది. కీలక అధికారుల పర్యవేక్షణకు కామన్‌ డ్యాష్‌బోర్డు ఏర్పాటు చేయనున్నారు. తుది మార్గదర్శకాల రూపకల్పన కోసం 15 రోజుల్లో శాఖల నుంచి సూచనలు కోరింది. నవంబర్‌ నెలాఖరులోగా మరో సమావేశం నిర్వహించనుంది.

రెండేళ్లలో వేల కేసులు

2024 జూలై నుంచి 2026 జూలై వరకు ఇసుక అక్రమాలకు సంబంధించి 2,113 కేసులు నమోదయ్యాయి. రూ.6.24 కోట్ల జరిమానాలు విధించగా, 117 వాహనాలను బ్లాక్‌లిస్ట్‌ చేసి, 21 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. చిన్న ఖనిజాల అక్రమాలపై 2024-25 నుంచి 2026 సెప్టెంబర్‌ 30 వరకు 9,120 కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి రూ.340.9 కోట్ల జరిమానాలు విధించారు. కొత్త మార్గదర్శకాల అమలుతో అక్రమ తవ్వకాలకు ఎంతవరకు అడ్డుకట్ట పడుతుందో చూడాలి.