ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకులు, బీమా సంస్థల ప్రైవేటీకరణను ఏపీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. చట్టంలో కొన్ని నిబంధనలను సవరించడం ద్వారా ప్రభుత్వరంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణకు ప్రభుత్వం మార్గాన్ని సుగమం చేసుకుంది.. దరిమిలా ఎల్‌ఐసీ వంటి కొన్ని ప్రభుత్వరంగ సంస్థలను (ఐపీవో మార్గంలో) ముక్కలు, ముక్కలుగా అమ్మకానికి పెడుతోంది. మరికొన్నింటిని హోల్‌సేల్‌గా అమ్మేస్తోందని విమర్శించారు.. పెట్టుబడుల ఉపసంహణకు ప్రతిపాదించిన 36 ప్రభుత్వరంగ సంస్థలలో ఇప్పటికే 8 సంస్థలలో ఈ ప్రక్రియ పూర్తయింది. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు, రేపు దేశవ్యాప్తంగా కార్మికులు, సిబ్బంది సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వరంగ సంస్థలు మన జాతి సంపద. వాటి వలన కీలకమైన మౌలిక వసతులు ఏర్పడుతున్నాయి. ప్రజానీకానికి అందుబాటు ధరల్లో వస్తువులు, సేవలు లభిస్తున్నాయి. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. మొన్నటికి మొన్న కోవిడ్ మహమ్మారి దేశంపై విరుచుకుపడినపుడు అప్పటికి అత్యవసరమైన మందులు, ఆక్సిజన్ సరఫరాతోపాటు గ్యాస్, విద్యుత్ సరఫరా నిరంతరం జరిగేలా చూసింది ప్రభుత్వరంగ సంస్థలే అన్న విషయాన్ని ప్రభుత్వానికి మరోమారు గుర్తు చేస్తున్నానని తెలిపారు విజయసాయి రెడ్డి.
ఇక, కరోనా కారణంగా ఉద్యోగస్తులతోపాటు సామాన్యుల పొదుపు మొత్తాలు వైద్య ఖర్చులు, ఇతర అత్యవసర ఖర్చులకు హరించికుపోయాయి. చిన్నపాటి వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఆర్థిక భారం నుంచి వారికి ఉపశమనం కలిగించేందుకు గడచిన రెండేళ్లలో ఆర్థిక మంత్రి ఎలాంటి టాక్స్ మినహాయింపులు ప్రకటించకపోవడం శోచనీయం అని ఆవేదన వ్యక్తం చేశారు విజయసాయి రెడ్డి. 2014 నుంచి 2022 నాటికి ద్రవ్యోల్బణం 40 శాతం పెరిగింది. కానీ, పన్ను మినహాయింపు మాత్రం రెండున్నర లక్షలకే పరిమితమైపోయింది. తరిగిపోతున్న ఆదాయం ఒకవైపు పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం మరోవైపు. ఈ నేపథ్యంలో టాక్స్ మినహాయింపులో ఎలాంటి మార్పు లేకపోతే వేతనజీవుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.. ఈపీఎఫ్ ఖాతాలపై చెల్లించే వడ్డీ 2018-19లో 8.65 శాతం ఉండగా 2021-22 నాటికి అది 8.1 శాతానికి తగ్గిపోయింది. వడ్డీ రేటు ఇంత కనిష్టానికి పడిపోవడం 44 ఏళ్లలో ఇదే తొలిసారని గుర్తుచేసిన ఆయన.. కోట్లాది మంది ఖాతాదారుల సేవింగ్స్‌పై ఇది తీవ్ర దుష్ప్రభావం చూపుతుందన్నారు.. నేషనల్ పెన్షన్ విధానం (ఎన్‌పీఎస్) చూస్తే మెచ్యూరిటీపై టాక్స్ విధించే ఏకైక సేవింగ్స్ స్కీమ్ ఇది. ఎన్‌పీఎస్‌ను పన్ను చెల్లింపుదార్లకు ఆకర్షణీయమైన పథకంగా తీర్చిదిద్దేందుకు ఎలాంటి సంస్కరణలను ప్రభుత్వం చేపట్టకపోవడం విచారకరం అన్నారు. ఒక వ్యక్తి తనకు లేదా తన కుటుంబ సభ్యుల కోవిడ్ ట్రీట్‌మెంట్ కోసం చేసే ఖర్చులపై టాక్స్‌ను మినహాయింపు ఇస్తూ ప్రభుత్వ నిర్ణయించడం ఆహ్వానించదగిందే… కానీ,హెల్త్ ఇన్సూరెన్స్ లేని కారణంగా అనేక మంది కోవిడ్ చికిత్స కోసం ఆస్తులు సైతం అమ్మి భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. హెల్త్ ఇన్సూరెన్స్‌పై ప్రస్తుతం విధిస్తున్న 18 శాతం జీఎస్టీని పూర్తిగా రద్దు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు.
Read Also: Beard From Work: వాళ్లంతే..! గడ్డం లేకపోతే ఉద్యోగం ఊడుతుందని వార్నింగ్
కరోనా కారణంగా ఏపీ ప్రభుత్వం.. కేంద్ర పన్నులలో తన వాటా కింద రావలసిన మొత్తంలో 7,780 కోట్ల రూపాయలు నష్టపోయింది. అలాగే టాక్స్ ఆదాయం కింద రావలసిన మరో 7 వేల కోట్ల రూపాయలు నష్టపోయిందని గుర్తుచేశారు విజయసాయి. దీని వలన రాష్ట్రానికి రెవెన్యూ నష్టం 2022 తర్వాత కూడా కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ బకాయిల చెల్లింపును 2026 వరకు వాయిదా వేసేందుకు జీఎస్టీ పరిహారం సెస్‌ను 2026 వరకు పొడిగించింది. కానీ, రాష్ట్రాలకు ఉపకరించే జీఎస్టీ పరిహారాన్ని మాత్రం పొడిగించలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాన్ని 2022 తర్వాత కూడా చెల్లించేలా గడువు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు, క్రిప్టో కరెన్సీని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. ప్రపంచంలో 150 వరకు క్రిప్టో ఎక్సేంజిలు ఉన్నాయి. అయితే, క్రిప్టో ఎక్సేంజిల ద్వారా కాకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే క్రిప్టో లావాదేవీలపై నియంత్రణ, నిఘా లేనందున ప్రభుత్వానికి ఈ లావాదేవీ గురించి ఎలా తెలుస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామాలకు దారి తీస్తుందని హెచ్చరించారు.. ఇన్‌కమ్ టాక్స్ చట్టంలోని సెక్షన్ 147ను నాలుగైదు దశాబ్దాలపాటు కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగం చేస్త వచ్చింది. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం దానిని సవరించింది. కానీ, ఈ సవరణలో అసెస్‌మెంట్ అధికారికి అసాధారణ అధికారాన్ని కట్టబెట్టినందు వలన ఆ అధికారి ఎలాంటి కారణం లేకుండానే మళ్లీ అసెస్‌మెంట్‌కు ఆదేశించే అవకాశం ఏర్పడింది. ఇలాంటి లొసుగులను అడ్డం పెట్టుకునే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాపై అనేక తప్పుడు కేసులు బనాయించిందన్నారు.. అసెస్‌మెంట్ అధికారికి కట్టబెట్టిన అసాధారణ అధికారం కారణంగా భవిష్యత్తులో రాజకీయ కక్ష సాధింపు కోసం దీనిని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉన్నందున వెంటనే సెక్షన్ 147కు సవరణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇక, కొన్ని షరతలు నుంచి మినహాయింపు పొందిన ధార్మిక సంస్థలు ప్రస్తుతం ఫైనాన్స్ బిల్లులోని సెక్షన్ 10, క్లాజ్ 23 కింద ప్రతిపాదించిన సవరణ ప్రకారం సెక్షన్ 11, 13 కింద కఠిన నిబంధనలకు కట్టుబడి పని చేసే ట్రస్టుల మాదిరగానే వ్యవహరించాల్సి ఉంటుంది. దీని వలన గుర్తింపు పొందిన ధార్మిక సంస్థలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ప్రభుత్వం సెక్షన్ 10ని పూర్తిగా రద్దు చేసి ట్రస్టులన్నింటినీ సెక్షన్ 11, 13 పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు విజయసాయిరెడ్డి.
