NTV Telugu Site icon

రివర్స్ పీఆర్సీ… ఉద్యోగుల రివర్స్ నడక

సాధారణంగా నడక ముందుకు సాగుతుంది. కానీ ఏపీలో ఉద్యోగులు మాత్రం రివర్స్ గా నడిచి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. రివర్స్ పీఆర్సీ ఇచ్చారంటూ గుంటూరులో ఉద్యోగులు వెనక్కు నడిచి ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద జరిగిన ఆందోళనల్లో జనవరి నెలకు సంబంధించి తమకు పాత వేతనాలే ఇవ్వాలంటూ నినాదాలు చేశారు.

ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీతో ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నసంగతి తెలిసిందే. పీఆర్సీ సాధన సమితి నేత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. కర్నూలులో ఉద్యోగులు చేపట్టిన ఆందోళనల్లో ఆయన పాల్గొన్నారు. కమిటీ 30 శాతం పీఆర్సీని సిఫార్సు చేస్తే.. కేవలం 23 శాతమే ప్రకటించడమేంటని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఉద్యోగులకు ఇంత తక్కువ వేతనాలు ఇవ్వడం అన్యాయం అన్నారు.

కొత్త వేతనాలు ప్రాసెస్ చేయాలని ట్రెజరీ ఉద్యోగుల్ని వత్తిడి చేయడం తగదన్నారు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్, పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు. శ్రీకాకుళంలో ఏపీ ఎన్జీవో హోం దగ్గర జరిగిన ఉద్యోగుల నిరాహారదీక్ష శిబిరానికి ఆయన వెళ్లారు. ఉమ్మడి కార్యాచరణలో భాగంగా అన్ని జిల్లాల్లోనూ ఉద్యమం సాగుతోందన్నారు. నాలుగు జేఏసీలు న్యాయమైన పోరాటం చేస్తున్నాయన్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని ఉద్యోగసంఘాలు తప్పబడుతున్నాయి.