AP Collectors Conference: అమరావతిలోని ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న కలెక్టర్ల సదస్సు రెండో రోజు కూడా కొనసాగనుంది. అయితే, ఇవాళ ఐటీ, రెవెన్యూ శాఖలపై ప్రత్యేకంగా సీఎం చర్చించనున్నారు. ఆదాయం వచ్చే శాఖలకు సంబంధించి కీలక సమీక్ష జరపనున్నారు. ఈ సందర్భంగా హెచ్ఆర్ డీ, హెల్త్ కు సంబంధించి రెండో రోజు కలెక్టర్ల సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం రాష్ట్రంలోని శాంతి భద్రతలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ప్రత్యేకంగా చర్చించనున్నారు. అలాగే, శాంతి భద్రతలతో పాటు డ్రగ్స్, గంజాయిని అరికట్టడంపై కూడా కీలక సూచనలు చేసే ఛాన్స్ ఉంది. ఇక, మహిళలు, చిన్న పిల్లలపై జరుగుతున్న దాడులు వీటికి సంబంధించిన అంశాలపై సమీక్షించనున్నారు. ఈ సందర్భంగా లా అండ్ ఆర్డర్ పై కొత్త ఎస్పీలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు ఇవ్వనున్నారు.
Read Also: Aarogyasri: నేటి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్..!
ఇక, నిన్న ప్రారంభమైన కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు పలు శాఖలపై సమీక్షించారు. ఈ సందర్భంగా విజయవాడలోని రాజరాజేశ్వరిపేటలో విజృంభిస్తున్న డయేరియా వ్యాప్తిని అరికట్టకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. RR పేట ఇష్యూ మానవ తప్పిదమన్న ఆయన.. రాజ రాజేశ్వరి పేటలో డయేరియా కట్టడిలో అధికారులు వైఫల్యం చెందారన్నారు. అలాగే, గుంటూరు జిల్లా తురకపాలెం ఘటనను కేస్ స్టడీగా తీసుకోవాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇక, అసంపూర్తిగా ఉన్న మెడికల్ కాలేజీల నిర్మాణంపై పీపీపీ (ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం) పద్ధతిలోనే ముందుకు పోతామని స్పష్టం చేశారు.
