NTV Telugu Site icon

రాష్ట్రం పరువు తీస్తున్నారు.. కుట్రలు చేస్తున్నారు..

గంజాయి పేరుతో రాష్ట్ర పరువును బజారున వేస్తున్నారు అంటూ ప్రతిపక్షాలపై మండిపడ్డారు సీఎం వైఎస్‌ జగన్‌.. విజయవాడలో పోలీసు అమరవీరుల దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. విధి నిర్వహణలో అమరులైన పోలీస్ సిబ్బంది వివరాలతో కూడిన అమరులు వారు పుస్తకాన్ని ఆవిష్కరించారు.. ఈ కార్యక్రమంలో హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్, సీఎస్ సమీర్ శర్మ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రం పరువు తీస్తున్నారు.. కుట్రలు చేస్తున్నారు.. రాష్ట్రంపై దాడి చేస్తున్నారంటూ విపక్షాలపై ఫైర్ అయ్యారు.. మన పిల్లలను డ్రగ్స్ బానిసలుగా ప్రపంచం ముందు చూపించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించిన సీఎం.. పథకం ప్రకారం కుట్రలు పన్నుతున్నారు. కళంకితలుగా ముద్ర వేసి పిల్లలు, ప్రజల భవిష్యత్తును నాశనం చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారం దక్కలేదనే..!
ఇక, శాంతి భద్రతల పరిరక్షణ ప్రథమ ప్రాధాన్యతగా స్పష్టం చేశారు సీఎం వైఎస్‌ జగన్.. ఈ విషయంలో పోలీసులు ఏ మాత్రం రాజీపడొద్దని సూచించిన ఆయన.. కులపరమైన దాడులు, సంఘ విద్రోహ శక్తులను ఉపేక్షించేదిలేదన్నారు.. పెద్దా, చిన్నా, తరతమ బేధాలు లేకుండా చర్యలు తీసుకోమని పోలీసులను ఆదేశించారు.. కొన్ని విషయాలను ప్రజల ముందు పెట్టాలి అంటూ.. నేర స్వభావాలు మారుతున్న ఈ కాలంలో వైట్ కాలర్ నేరాలు పెరుగుతున్నాయన్నారు సీఎం వైఎస్ జగన్‌.. ఇతర ప్రాంతాల్లో ఉంటూ ఈ రాష్ట్రంలో నేరం కొత్త రూపాల్లో దాడి చేస్తోందన్న ఆయన.. ఇటువంటి ఓ కొత్త రూపాన్ని గత రెండేళ్లుగా రాష్ట్రంలో చూస్తున్నాం అన్నారు.. అధికారం దక్కలేదని చీకట్లో గుళ్లపై దాడులు చేస్తున్నారు.. అధికారం దక్కలేదని కులాలు, మతాల మధ్య చిచ్చు రేపటానికి వెనుకడుగు వేయడం లేదు.. అధికారం దక్కలేదని సంక్షేమ పథకాలను కూడా కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎంను తిట్టడం కరెక్టేనా..?
మా వాడు అధికారంలో లేకపోతే ముఖ్యమంత్రిని కూడా బూతులు తిడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం వైఎస్‌ జగన్.. ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రి తల్లిని ఇలా బూతులు తిట్టడం కరక్టేనా? అని ప్రశ్నించిన ఆయన.. అసాంఘిక శక్తులు రాజకీయ నాయకులుగా రూపం మార్చుకున్నరాయని ఆరోపించారు.

పోలీసు వ్యవస్థలో ఎన్నో మార్పులు..
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థలో ఎన్నో మార్పులు తెచ్చామన్నారు సీఎం వైఎస్‌ జగన్.. దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీసులకు వీక్లీ ఆఫ్ లు ప్రకటించామని గుర్తుచేసిన ఆయన.. 2017 నుంచి బకాయిలు ఉన్న 15 కోట్లు విడుదల చేశామని.. భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నాం అని వెల్లడించారు. ఇక, హోమ్ గార్డుల గౌరవ వేతనం పెంచాం.. 16వేల మంది మహిళా పోలీసులకు శిక్షణ ఇస్తున్నాం, కోవిడ్ బారిన పడి మృతి చెందిన పోలీసు కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇచ్చామన్న ఏపీ సీఎం.. పోలీసులే కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో కారుణ్య నియామకాలకు ఆదేశించామని.. ఇది కూడా నవంబరు 30 లోపు చేపట్టాలని గడువు కూడా విధించామని తెలిపారు సీఎం వైఎస్‌ జగన్.