NTV Telugu Site icon

YS Jagan Mohan Reddy: మోటార్లకు మీటర్లపై సీఎం సమీక్ష.. చాలా విద్యుత్‌ ఆదా..

Ys Jagan

Ys Jagan

YS Jagan Mohan Reddy: వ్యవసాయ మోటార్లకు మీటర్ల ద్వారా చాలా విద్యుత్‌ ఆదా అయ్యిందన్నారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఇంధనశాఖపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ఆయనకు.. గతంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతిని వివరించారు విద్యుత్‌శాఖ అధికారులు.. విద్యుత్‌ డిమాండ్, కొనుగోళ్లు, మార్కెట్లో అందుబాటులో ఉన్న విద్యుత్, వాటి ధరలు తదితర అంశాలపై డేటా అనలిటిక్స్‌ ఎస్‌ఎల్‌డీసీలో ఏర్పాటు చేశారు.. విద్యుత్‌ కొనుగోలు ఖర్చు తగ్గించుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతోంది.. కచ్చితమైన డిమాండ్‌ను తెలిపిపేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ విధానం కీలకంగా మారింది.. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. కీలక సూచలన చేశారు.. బొగ్గు నిల్వలకు ఎలాంటి కొరత లేకుండా చూసుకోవాలని.. విదేశీ బొగ్గు ధరలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దేశీయంగానే వీటిని సమకూర్చేకునేలా ప్రయత్నాలు చేయాలన్నారు.. వేసవి కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు చర్యలు తీసుకోవాలని.. సులియారీ, మహానది కోల్‌బాక్స్‌ నుంచి పూర్తిస్థాయి ప్రయోజనాలు పొందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Read Also: Sajjala Ramakrishna Reddy: చంద్రబాబుకు ప్రజలు ఓటు బ్యాంకు మాత్రమే.. ఓట్ల కోసం వైసీపీ చౌకబారు ఎత్తుగడలు వేయదు..!

ఇక, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్.. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టుకునేందుకు ఇప్పటికే 16,63,705 మంది రైతుల అంగీకరించారని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నందున వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు.. అయితే, వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్‌ పంపిణీ అత్యంత పారదర్శకంగా, నాణ్యంగా, రైతులకు మేలు చేసేదిగా ఉండాలని స్పష్టం చేశారు సీఎం.. అత్యంత మెరుగైన వ్యవస్థను తీసుకురావాలన్న ఆయన.. రైతులకు మీటర్లపై నిరంతర అవగాహన కల్పించాలన్నారు.. మీటర్లు పెట్టడం వల్ల రైతులకు ఎంత కరెంటు అవసరమో తెలుస్తుంది.. దీని వల్ల సరిపడా విద్యుత్‌ను పంపిణీ చేయడానికి వీలు కలుగుతుంది.. దీని వల్ల రైతుల మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవన్నారు.. రైతులకు ఒక్క పైసా కూడా ఖర్చు కాకుండా విద్యుత్‌ పంపిణీ సంస్థలే మీటర్లను బిగిస్తాయి.. వినియోగించుకున్న విద్యుత్‌కు అయ్యే ఖర్చును కూడా నేరుగా రైతుల ఖాతాల్లోకి పంపుతారని.. అక్కడ నుంచి ఆ డబ్బు విద్యుత్‌ పంపిణీ సంస్థలకు చేరుతుందని.. దీని వల్ల రైతులకు విద్యుత్‌ పంపిణీ సంస్థలు జవాబుదారీగా ఉంటాయన్నారు. శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలట్‌ ప్రాజెక్టు కారణంగా రైతులకు పెద్ద ఎత్తున మేలు జరుగుతోంది.. దీని వల్ల చాలా విద్యుత్‌ ఆదా అయ్యిందన్నారు సీఎం వైఎస్‌ జగన్‌.

మరోవైపు.. ఈ సమావేశంలో.. పోలవరం విద్యుత్‌ ప్రాజెక్టులో నిర్మాణ పనుల ప్రగతిని సీఎం వైఎస్‌ జగన్‌కు వివరించిన అధికారులు.. ఇప్పటికే టర్బైన్‌ మోడల్‌ టెస్ట్‌ ముగిసిందని, ఇంజనీరింగ్‌ డ్రాయింగ్స్‌ వేగంగా పూర్తవుతున్నాయని తెలిపిన అధికారులు… పవర్‌ హౌస్‌లో కాంక్రీటు పనులు ముందుకు సాగుతున్నాయని తెలిపారు.. అప్పర్‌ సీలేరులో 1350 మెగావాట్ల ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్‌ పూర్తయ్యిందని సీఎంకు వివరించారు.. టెండర్ల ప్రక్రియకు సిద్ధమవుతున్నామని సీఎం దృష్టికి తీసుకెళ్లారు అధికారులు.