మేకపాటి గౌతమ్‌రెడ్డి నాకు మంచి మిత్రుడు.. నేను లేకుంటే గౌతమ్ అసలు రాజకీయాల్లోకి వచ్చేవాడు కాదేమో అని వ్యాఖ్యానించారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇవాళ నెల్లూరు వెళ్లిన ఆయన.. దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం గౌతమ్ రెడ్డి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించి.. గౌతమ్‌రెడ్డి సంస్మరణ సభలో పాల్గొని మాట్లాడుతూ.. గౌతమ్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.. గౌతమ్ మన మధ్య లేడనే వార్త చాలా కష్టంగా ఉంది. తాను ఇక లేడు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. చిన్నప్పటి నుంచి గౌతమ్ నాకు మంచి స్నేహితుడు. ప్రతీ అడుగులో నాకు తోడుగా ఉన్నాడు.. గౌతమ్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం చెప్పలేనిది. రాజకీయాల్లోని తనను నేను తీసుకువచ్చాను. రాజకీయాల్లో ఇద్దరం మంచి స్నేహితులుగా ఉన్నామని తెలిపారు.
Read Also: YS Jagan Nellore Tour: సీఎం పర్యటనలో భద్రతా వైఫల్యం..!
ఇక, నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు గౌతమ్ వల్లే రాజమోహన్ రెడ్డి మద్దతు లభించిందన్నారు సీఎం వైఎస్ జగన్.. రాజకీయాల్లో నన్ను ఎంతో ప్రోత్సాహించారు.. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది… ఆరు శాఖలకు మంత్రిగా పనిచేశారని.. మంచి స్నేహితుడు.. మంచి వ్యక్తిని కోల్పోయాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. గౌతం కుటుంబానికి పార్టీతో పాటు అంతా అండగా ఉంటామని హామీఇచ్చిన జగన్.. వెలిగొండ ప్రాజెక్ట్ ద్వారా ఉదయగిరి.. బద్వేలు.. ఆత్మకూరుకు ఎంతో మేలు జరుగుతుందని.. మే 15లోగా గౌతమ్ జ్ఞాపకార్థం సంగం బ్యారేజ్‌ను ప్రారంభిస్తామని వెల్లడించారు.. ఇక, ఈ కార్యక్రమంలో గౌతమ్‌రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ముందు నుండి వైఎస్‌ఆర్ కుటుంబం తమకు అండగా ఉందన్నారు. సీఎం వైఎస్ జగన్‌మెహన్ రెడ్డికి తన కుటుంబం కృతజ్ఞతలు తెలుపుతోందని ఈ సందర్భంగా వెల్లడించారు.. తమ కుటుంబంపై చూపిన ప్రేమకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకున్నారు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి.
