NTV Telugu Site icon

YS Jagan and Chandrababu: ఢిల్లీకి సీఎం జగన్‌.. అదే సమయంలో చంద్రబాబు హస్తిన బాట

Ys Jagan And Babu

Ys Jagan And Babu

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మరోసారి ఢిల్లీ బాటపట్టనున్నారు.. డిసెంబర్‌ 5వ తేదీన హస్తినకు వెళ్తారు సీఎం జగన్.. ఢిల్లీ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే దేశంలోని రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశానికి హాజరుకానున్నారు వైసీపీ అధినేత.. డిసెంబర్‌ 1వ తేదీ 2022 నుంచి నవంబర్‌ 30, 2023 వరకు జీ- 20 దేశాల కూటమికి అధ్యక్షత వహించనుంది భారతదేశం.. ఈ నేపథ్యంలో భారత్ లో నిర్వహించే జీ -20 భాగస్వామ్య దేశాల సమావేశాలపై రాజకీయ పార్టీల అధ్యక్షులతో చర్చించబోతున్నారు ప్రధాని మోడీ.. రాష్ట్రపతి భవన్ లో 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఈ సదస్సు జరగనుంది.. సమావేశానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషీ ఇప్పటికే ఆహ్వానం పంపారు.. ఈ నెల 15 వ తేదీన ఆహ్వాన లేఖ పంపారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషీ.. దీంతో, ఈ నెల 5వ తేదీన హస్తినకు వెళ్లనున్నారు సీఎం జగన్.

Read Also: Gidugu Rudra Raju: దేశానికి, రాష్ట్రానికి ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ పార్టీయే..

మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ వెళ్లనున్నారు.. కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు డిసెంబర్ 5వ తేదీన చంద్రబాబు ఢిల్లీకి వెళ్తారు.. ఆ రోజు ప్రధాని మోడీని చంద్రబాబు కలవనున్నారు. ప్రధాని అధ్యక్షతన జరిగే రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశంలో పాల్గొనేందుకు మాత్రమే చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో ప్రధాని సమావేశం కానున్నారు. భారత్ లో నిర్వహించే జీ 20 భాగస్వామ్య దేశాల సమ్మిట్ పై ఈ సమావేశాలలో ప్రధాని రాజకీయ పార్టీ అధ్యక్షులతో చర్చించనున్నారు. ఈ సమావేశానికి రావాల్సిందిగా కేంద్ర మంద్రి ప్రహ్లాద్ జోషి చంద్రబాబుకు ఫోన్ చేసి ఆహ్వానించడంతో ఆయన ఢిల్లీకి వెళ్లబోతున్నారు.. అంటే, ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొనబోతున్నారు.. విషయం ఏదైనా.. వేదిక ఏదైనా.. ఇద్దరు నేతలు ఒకే సమావేశం కోసం ఢిల్లీకి వెళ్తుండడం ఆసక్తికరంగా మారింది. ఒకే సమయంలో ఇద్దరు నేతలు పాల్గొన్న సందర్భాలు కూడా చాలా అరుదైన ఘటనే కావడం ఉత్కంఠగా మారింది.. ఈ సమయంలో ఎదురుపడితే.. మన నేతల మధ్య పలకరింపులు ఉంటాయా? నమస్కారాలు, ప్రతి నమస్కారాలు కూడా ఉండనున్నాయా? అనేది వేచి చూడాల్సిన విషయమే.