ఈనెల 20న ఆదివారం నాడు కడప, విశాఖ జిల్లాల్లో ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ముందుగా కడప జిల్లాలో పర్యటించి సీఎం జగన్ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ఆదివారం ఉదయం 11 గంటలకు సీఎం జగన్ కడప చేరుకుంటారు. పుష్పగిరిలోని విట్రియో రెటీనా ఐ ఇన్ స్టిట్యూట్ ప్రారంభిస్తారు. అనంతరం డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు.
ఆ తర్వాత కడప నుంచి సీఎం జగన్ తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. అదే రోజు సాయంత్రం 4:45 గంటలకు సీఎం జగన్ విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి విశాఖలోని ఐఎన్ఎస్ డేగా వద్దకు చేరుకుని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు స్వాగతం పలుకుతారు. అనంతరం రాత్రి 7 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఈ మేరకు అధికారులు సీఎం పర్యటనకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
