CM Jagan: అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా నగరాల్లో పరిశుభ్రత, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, మురుగునీటి శుద్ధి, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్, నగరాలు, పట్టణాల్లో సుందరీకరణ పనులు, పచ్చదనం పెంపు, టిడ్కో ఇళ్ల నిర్మాణం, వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్స్, జగనన్న స్మార్ట్‌టౌన్‌షిప్స్ వంటి అంశాలపై సీఎం జగన్ రివ్యూ చేశారు. ముఖ్యంగా కృష్ణానదికి వరద ముంపు రాకుండా యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం రిటైనింగ్ వాల్ నిర్మించిందని, అయితే రిటైనింగ్ వాల్‌కు మురుగునీరు చేరకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అలాగే రిటైనింగ్ వాల్ బండ్‌ను చెట్లు, విద్యుత్ దీపాలు, ఏర్పాటు చేసి అందంగా తీర్చిదిద్దాలన్నారు.
Read Also: Hyderabad Metro: నగరవాసులకు శుభవార్త.. హైదరాబాద్ మెట్రో సర్వీసుల వేళలు పెంపు
గార్బేజ్ స్టేషన్‌ల ఏర్పాటు కారణంగా ఆయా పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏ మాత్రం ఉండకూడదని సీఎం జగన్ అధికారులకు సూచించారు. గార్బేజ్ స్టేషన్‌ల నిర్వహణలో అత్యుత్తమ విధానాలు పాటించాలన్నారు. ప్రతి మున్సిపాలిటీలో వేస్ట్ ప్రాసెసింగ్ ప్రక్రియల అమలు తీరును పరిశీలించాలన్నారు. పట్టణాలు, నగరాల్లో రోడ్ల పరిస్థితిని పరిశీలించాలని..
వచ్చే ఏడాది మార్చి 31 కల్లా అన్ని రోడ్లనూ మళ్లీ బాగు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో ప్లాస్టిక్ ప్లెక్సీలను నిషేధించామని.. దీన్ని అమలు చేయడానికి సంబంధిత వ్యాపారులతో కలెక్టర్లు సమావేశాలు నిర్వహించాలని సీఎం జగన్ తెలిపారు. ప్లాస్టిక్ నుంచి క్లాత్ వైపు మళ్లడానికి కావాల్సిన ఆర్థిక వనరుల విషయంలో అండగా నిలబడాలని సూచించారు. ఫ్లెక్సీ వ్యాపారులకు రుణాలు ఇప్పించి అండగా నిలవాలన్నారు. ఇప్పించిన రుణాలను సకాలంలో కట్టేవారికి వడ్డీ రాయితీ కల్పించేలా ఆలోచనలు చేయాలన్నారు.