Site icon NTV Telugu

CM Jagan Review Meeting: అలా అయితే మళ్లీ టిక్కెట్ ఇచ్చే ప్రసక్తే లేదు

Cm Jagan

Cm Jagan

అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సోమవారం మధ్యాహ్నం ఏపీ సీఎం జగన్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సమావేశంలో రీజనల్‌ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేల పని తీరును పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో సీఎం జగన్‌కు పీకే టీమ్ వివరించింది. 10 రోజుల లోపు గడప గడపకు 22 మంది ఎమ్మెల్యేలు వెళ్లారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఆళ్ళ నాని, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అసలు పాల్గొనలేదు. ఈ మేరకు పది రోజుల లోపు మాత్రమే వెళ్లిన వారు మరింత వేగం పెంచాలని సీఎం జగన్ సూచించారు. నియోజకవర్గానికి దాదాపు రూ.20 కోట్లు ప్రభుత్వం వెచ్చిస్తుందని తెలిపారు. ఈ మూడేళ్లలో తాను చేయాల్సిన సంక్షేమం అంతా చేశానని.. ఈ రెండేళ్ళు అభివృద్ధిపైనే ఫోకస్ చేస్తామన్నారు. పెద్ద పనులు కాదు ప్రజల అవసరాలు ఏంటో గమనించి స్థానికంగా వాటిని తీర్చాలన్నారు. ఇంత మొత్తంలో నిధుల కేటాయింపు కష్టమే అయినా ఇస్తున్నానని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. సచివాలయాలకు పది రోజులు కూడా తిరగని వారిని ఈ ప్రబుద్ధులు ఎవరు అంటూ సీఎం జగన్ ఛమత్కరించారు. ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్ళకపోతే తనకేం నష్టం లేదన్నారు. ప్రజల్లో తిరిగితే ఎమ్మెల్యేలే గెలుస్తారని జగన్ అన్నారు. తిరగకుండా ఉన్నా, మొక్కుబడిగా తిరిగినా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు.

అటు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నాణ్యత చాలా ముఖ్యమని సీఎం జగన్ అన్నారు. జీవితంలో ఏ కార్యక్రమమైనా.. నాణ్యతతో చేస్తేనే నిలదొక్కుకుంటామన్నారు. అందుకే క్వాలిటీతో కార్యక్రమాలు చేయడం అన్నది ముఖ్యమన్నారు. పరిపాలనలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామని.. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి అనేక చర్యలు తీసుకున్నామని జగన్ తెలిపారు. అనేక పథకాలను అమలు చేశాం, అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు మనమీద ఆధారపడి ఉన్నాయన్నారు. వారికి న్యాయం జరగాలంటే.. మనం అధికారంలోకి తిరిగి రావాలన్నారు. మరోసారి అధికారంలోకి మామూలుగా రావడం కాదని.. మునుపటికన్నా మెరుగైన ఫలితాలతో రావాలని సూచించారు. కుప్పం నియోజకవర్గంలో పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు సాధించామని.. అలాంటప్పుడు మనం అనుకున్న ఫలితాలు ఎందుకు సాధించలేమని ప్రశ్నించారు.

 

రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు పథకాలు అందించామని సీఎం జగన్ వివరించారు. వారి మద్దతు తీసుకుంటే.. 175కి 175 స్థానాలో ఎందుకు గెలవలేమని నిలదీశారు. తాను చేయాల్సింది అంతా చేస్తున్నానని.. ఎమ్మెల్యేలు కూడా కష్టపడాలన్నారు. ఎలాంటి వివక్షలేకుండా, అవినీతికి తావు లేకుండా సంక్షేమ కార్యక్రమాలను అందరికీ అందిస్తున్నామన్నారు. పథకాలకు బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే పంపుతున్నామన్నారు. ప్రతినెలా క్యాలెండర్‌ ఇచ్చి.. ఎలాంటి పరిస్థితులు ఉన్నా పథకాలకు బటన్‌ నొక్కుతున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరికీ మంచి చేయడాన్ని తన ధర్మంగా.. తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తిస్తున్నానని చెప్పారు. దీనివల్ల ఒక వాతావరణం, ఒక ఫ్లాట్‌ఫాం క్రియేట్‌ అయ్యిందన్నారు.

దాన్ని ముందుకు తీసుకెళ్లడమే ఎమ్మెల్యేల బాధ్యత అన్నారు. ఎమ్మెల్యేలు చేయాల్సింది చేస్తేనే ఫలితాలు సాధిస్తామన్నారు. ఇద్దరూ కలిసికట్టుగా ముందుకు సాగితేనే మంచి ఫలితాలు సాధించగలుగుతామన్నారు. అలాంటి పరిస్థితి మన కళ్లముందు కనిపిస్తున్నప్పుడు మనం అడుగులు ముందుకేయాలన్నారు. గతంలో కన్నా.. మెరుగ్గా ఫలితాలు సాధించాలన్నారు.ఒక్కో సచివాలయంలో ప్రాధాన్యతా పనులకు రూ.20 లక్షలు కేటాయింపు జరుగుతుందన్నారు. గడపగడపకూ వెళ్లినప్పుడు ప్రజల నుంచి వినతులను పరిగణలోకి తీసుకుని ప్రాధాన్యతా పనుల కోసం ఈ డబ్బు ఖర్చు చేస్తామన్నారు. ఒక నెలలో ఎమ్మెల్యేలు తిరిగే సచివాలయాల్లో పనులకు సంబంధించి ముందుగానే కలెక్టర్లకు డబ్బు ఇస్తామన్నారు. తర్వాత వెంటనే పనులు ప్రారంభమయ్యేలా కార్యాచరణ ఉంటుందన్నారు. ఎమ్మెల్యేలకు రూ.2 కోట్లు చొప్పున కేటాయిస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలమేరకు ఇవాళ జీవో కూడా ఇచ్చామన్నారు. ముఖ్యమంత్రి అభివృద్ధి నిధి (సీఎండీఎఫ్‌) నుంచి ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద కేటాయింపు జరుగుతుందన్నారు. సచివాలయాలకు కేటాయించే నిధులకు ఇది అదనంగా ఉంటుందన్నారు. ప్రతి సచివాలయానికి రూ.20 లక్షలు కేటాయించి పనులు చేయించే ఛాలెంజ్‌ను తాను తీసుకున్నానని.. ఇక ఎమ్మెల్యేలు చేయాల్సిందల్లా గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. గడప గడపకూ కార్యక్రమంలో భాగంగా రానున్న నెలరోజుల్లో ఏడు సచివాలయాలను ఎమ్మెల్యేలు సందర్శించాలన్నారు. వచ్చే నెలరోజుల్లో కనీసంగా 16 రోజులు– గరిష్టంగా 21రోజులు గడపగడపకూ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. కమిట్‌మెంట్‌తో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. గడపగడపకూ కార్యక్రమాన్ని మానిటర్‌ చేయాలని.. ఇందు కోసం 175 నియోజకవర్గాలకు అబ్జర్వర్లను నియమించాలని సీఎం జగన్ ఆదేశించారు.

Exit mobile version