CM Jagan Review Meeting: అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈఏపీ (ఎక్స్‌టర్నెల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్)పై అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా న్యూడెవలప్‌మెంట్ (ఎన్డీబీ)బ్యాంకు, ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ), జపాన్ ఇంటర్నేషనల్ కోపరేషన్ ఏజెన్సీ (జైకా), ప్రపంచ బ్యాంకు, కేఎఫ్‌బీ బ్యాంకుల రుణ సహాయంతో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులపై సమీక్ష జరిపారు. మొత్తం 10 ప్రాజెక్టుల కోసం రూ. 25,497.28 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని తెలిపారు. ఈ ప్రాజెక్టు పనుల్లో అలసత్వం లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. నిర్దేశిత సమయంలోగా వివిధ ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడాలన్నారు.
Read Also: Kodali Nani: పరిపాలన రాజధానిగా విశాఖ.. ఇది ఫిక్స్ అంతే..!!
రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర వంటి కరవు ప్రాంతాల్లో చెరువులను కాల్వల ద్వారా అనుసంధానం చేయాలని సీఎం జగన్ అధికారులకు తెలిపారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని చెరువుల పరిస్థితిపై అధ్యయనం చేయాలన్నారు. ఒకవేళ అవసరమైన చోట చెరువులు లేకపోతే కొత్తగా చెరువులు నిర్మించాలని సూచించారు. ఈ చెరువులు అన్నింటినీ గ్రావిటీ ద్వారా నీరు ప్రవహించేలా కాల్వలతో అనుసంధానం చేయాలని సీఎం జగన్ పేర్కొన్నారు. దీని వల్ల భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయన్నారు. పర్యావరణ సమతుల్యత ఉంటుందన్నారు. చెరువు కింద భూముల సాగు జరుగుతుందని.. వ్యవసాయం బాగుండడంతో ఉపాధి, ఆదాయాలు కూడా స్థిరంగా ఉంటాయని తెలిపారు. ఒక సమగ్రమైన అధ్యయనం చేసి, ఈ ప్రాజెక్టును చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రపంచ బ్యాంకు లాంటి ఆర్థిక సంస్థల సహాయంతో దీన్ని చేపట్టాలన్నారు. పనులు పూర్తి చేయకుండా వదిలేసిన బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లైఓవర్లు పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలన్నారు.
రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడుల్లో మూడు పోర్టులు కడుతున్నామని.. వీటి చుట్టు పక్కల అభివృద్ధి జరిగే అవకాశాలు ఉంటాయని సీఎం జగన్ తెలిపారు. వాటి పరిధిలో ల్యాండ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయడం చాలా అవసరమన్నారు. దీని వల్ల పోర్టు ఆధారితంగా అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు.
