NTV Telugu Site icon

Jagan Davos Tour: టెక్ మహింద్రాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

Jagan Tech Mahindra

Jagan Tech Mahindra

సీఎం జగన్ దావోస్ పర్యటనలో రెండో రోజు బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా పలు ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. టెక్‌ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానితో జగన్ సమావేశమై కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో పెట్టబడులు పెట్టాలని జగన్ రిక్వెస్ట్ చేయగా.. గుర్నాని సానుకూలంగా స్పందించారు.

విశాఖను మేజర్‌ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దాలని సీఎం జగన్ సంకల్పంతో ఉన్నారని టెక్‌ మహీంద్రా ఎండీ, సీఈవో గుర్నాని వివరించారు. నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడులు పెట్టాలని సీఎం కోరారని ఆయన తెలిపారు. నైపుణ్యాలను పెంచేందుకు, హైఎండ్‌ టెక్నాలజీపై వచ్చే మూడు నెలల్లో యూనివర్శిటీతో కలిసి ప్రత్యేక పాఠ్యప్రణాళికను రూపొందిస్తామని పేర్కొన్నారు. ఆర్టిఫియల్‌ ఇంటలిజెన్స్‌కు ప్రధాన కేంద్రంగా విశాఖపట్నాన్ని తీర్చిద్దాలని శ్రమిస్తున్నారని.. ఈ కల సాకారానికి ఏపీతో కలిసి రావాలని ఆహ్వానించారన్నారు.

మరోవైపు దస్సాల్ట్‌ సిస్టమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఫ్లోరెన్స్‌ వెర్జలెన్‌తో సీఎం జగన్ సమావేశమై ఏపీలో పెట్టుబడుల విషయంపై వివరించారు. మరోవైపు స్విస్‌ పార్లమెంటు ప్రతినిధి బృందంతో సీఎం జగన్ సమావేశమయ్యారు. భారత సంతతికి చెందిన స్విస్‌ ఎంపీ నిక్లాజ్‌ శామ్యూల్‌ గుగెర్‌ బృందంతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఏపీలో వ్యాపార అవకాశాలపై సీఎం జగన్‌తో స్విస్ పార్లమెంట్ ప్రతినిధి బృందం చర్చించింది.

మరోవైపు ఓఎస్‌కే లైన్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్, సీఈవో తకీషి హషిమొటోతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తకీషి హషిమొటోతో మాట్లాడుతూ.. షిప్పింగ్, లాజిస్టిక్స్‌ వ్యాపార రంగానికి సంబంధించి ఏపీలో ఉన్న అవకాశాలపై చర్చించామన్నారు. ఏపీకి గొప్ప అవకాశాలున్నాయని.. తమ వ్యాపారాన్ని విస్తరించడానికి తమకూ అవకాశం కలుగుతోందని అభిప్రాయపడ్డారు. తాము భారత్‌లో పూర్తిస్థాయి కంపెనీని పెట్టామని.. ఏపీలో ఈ కంపెనీ ద్వారా వ్యాపారాన్ని విస్తరిస్తామని తెలిపారు. ఏపీకి పొడవైన తీరప్రాంతం ఉందని.. కొత్తగా నిర్మించే నాలుగు పోర్టుల ద్వారా ఈ రంగంలో వ్యాపార అవకాశాలు మరింత పెరుగుతాయని తకీషి హషిమొటో వివరించారు.