మంత్రివర్గ విస్తరణ తర్వాత తొలిసారిగా సీఎం జగన్ అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సచివాలయం మొదటి బ్లాక్ లో మధ్యాహ్నం 3గంటలకు సమావేశం జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. సమీర్ శర్మ అన్ని శాఖల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే తొలుత శుక్రవారం ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ జరగాల్సి ఉండగా.. పలు కారణాల నేపథ్యంలో మంత్రివర్గ సమావేశాన్ని గురువారం మధ్యాహ్నం 3గంటలకు ఏర్పాటు చేశారు అధికారులు. నూతన మంత్రి వర్గం తొలి సమావేశంలో సీఎం జగన్ పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటారని చర్చ జరుగుతోంది.
దేవాదాయ శాఖలో 2 లక్షల ఎకరాల ఆక్రమణలకు సంబంధించిన అంశంపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అయితే ఇందులో దాదాపు లక్ష ఎకరాలు అర్చకుల ఆక్రమణలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దిశ చట్టంపై సవరణలకు సంబంధించిన అంశాన్ని కూడా కేబినెట్ లో మరోమారు నిర్ణయం తీసుకొని కేంద్రానికి పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇటీవల కోనసీమ జిల్లాలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులతో పాటు.. ఆ జిల్లా పేరు మార్పుపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
35 పారిశ్రామిక ప్రతిపాదనలకు సంబంధించిన 112 ఎకరాల భూ కేటాయింపుల పై చర్చించనున్న మంత్రి మండలి.. 2,211 కోట్ల పెట్టుబడులు,
2,443 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్న ప్రతిపాదిత పరిశ్రమలు.. అదానీ గ్రీన్ ఎనర్జీ రూ.15,376 కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన పంప్డ్ స్టోరేజ్ విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటు ప్రతిపాదన పై చర్చ జరిగే అవకాశం. తిరుపతిలో నోవాటెల్ బ్రాండ్ కింద ఫైవ్ స్టార్ హోటల్ ఏర్పాటు ప్రతిపాదన పై చర్చించే అవకాశం. కృష్ణా జిల్లా మల్లవల్లి ఫుడ్‌పార్కులో రూ.150 కోట్లతో అవిసా ఫుడ్స్ రొయ్యల ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదన పై క్యాబినెట్ చర్చించే అవకాశం.
