Site icon NTV Telugu

AP Assembly: సెల్ ఫోన్లకు నో పర్మిషన్… స్పీకర్‌ రూలింగ్‌

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ప్రతీ రోజు నిరసనలు, ఆందోళనకు కొనసాగుతున్నాయి.. ఇప్పటికే పలు దఫాలుగా టీడీపీ సభ్యులను సభ నుంచి స్పీకర్‌ సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే.. ఇక, ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఏడోరోజు బడ్జెట్ సమావేశాల్లోనూ నిరసనలు తప్పలేదు.. మరోవైపు సభలోకి సెల్ ఫోన్లు తీసుకురావడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు స్పీకర్‌ తమ్మినేని సీతారాం.. దీనిపై స్పీకర్‌ తమ్మినేని రూలింగ్‌ ఇచ్చారు. అయితే, స్పీకర్ రూలింగ్‌పై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.. సభలో జరుగుతున్న పరిణామాలను సెల్ ఫోన్‌తో రికార్డు చేసి మీడియాకు టీడీపీ సభ్యులు చేరవేస్తున్నారని సమాచారం తనకు ఉందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు స్పీకర్‌.

Read Also: COVID 19: మరో కొత్త వేరియంట్‌.. భారత్‌లో కలవరం..!

అయితే, వైసీపీ సభ్యులు కూడా సెల్ ఫోన్లు తీసుకువస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు వాదించారు.. కానీ, సభలోకి ఎవ్వరూ సెల్ ఫోన్లు తీసుకు రాకూడదని స్పష్టం చేశారు స్పీకర్.. ఎవ్వరి మనోభవాలు దెబ్బతినకుండా ఉండాలంటే సెల్ ఫోన్లను సభలోకి అనుమతించకపోవడమే సరైన విధానం అన్నారు.. సెల్ ఫోన్లను వాలంటరీగా సరెండర్ చేయాలని తెలిపారు.. టీడీపీ సభ్యులు స్పీకర్ సూచనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మరోవైపు, మార్షల్స్ నెట్టేస్తున్నారన్న అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు టీడీపీ సభ్యులు.. అయితే, మార్షల్స్ వారి విధులను వాళ్లు నిర్వహిస్తున్నారని స్పీకర్‌ స్పష్టం చేశారు. కాగా, ఏడో రోజు బడ్జెట్‌ సమావేశాల్లోనూ టీడీపీ సభ్యుల నిరసన, స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టడం.. జంగారెడ్డి గూడెం ఘటనను ప్రస్తావించడం వంటి పరిణామాలతో సభలో కాసేపు హాట్‌హాట్‌గా మారిపోయింది.

Exit mobile version