విద్యాలయాల్లో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలోని శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో అవేర్ నెస్ ఆన్ యాంటీ ర్యాగింగ్’ కార్యక్రమం ఏర్పాటు చేసి ర్యాగింగ్ ఫై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ర్యాగింగ్ వల్ల సంభవించే అనర్థాల గురించి జిల్లాఎస్పీ రాహుల్ దేవ్ శర్మ అవగాహన కల్పించారు. ర్యాగింగ్ దాని వల్ల ఎదురయ్యే దుష్పరిణామాలపై అవగాహన లేకపోవడం వల్ల విద్యార్థులు తెలియకుండానే దాని వల్ల చాలా ఇబ్బందికరమైనా పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియ జేస్తూ ర్యాగింగ్ అంటే ఏమిటి, ర్యాగింగ్ చేయడం, ర్యాగింగ్ ను ప్రోత్సహించడం లేదా ర్యాగింగ్ ఘటనలో పాలు పంచుకోవడం లాంటి వాటిలో ఎటువంటి శిక్షలు ఉంటాయి అనే వాటిపై విపులంగా వివరించారు.
మీ దృష్టిలో ర్యాగింగ్ చాలా చిన్నది అనిపించవచ్చు లేదా కేవలం ఇంటరాక్ట్ కావడం ర్యాగింగ్ ఎలా అవుతుంది అనుకోవచ్చు అన్నారు. కానీ ర్యాగింగ్ చట్టంలో మీరు చేసిన దానిని బట్టి కనీసం ఆరు నెలల నుండి పది సంవత్సరాల వరకు జైలు శిక్ష వుంటుందన్నారు. అంతే కాకుండా ర్యాగింగ్ నేరంలో శిక్ష అనుభవించి బయటకు వచ్చిన తరువాత మీరు ఎక్కడా చదువు కోవడానికి వీలు లేని పరిస్థితులు ఏర్పడతాయి.
మీ విలువైన జీవితంతో పాటు భవిష్యత్తు కూడా నాశనం అవుతుందన్న విషయాన్ని గ్రహించాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు డి ఎస్ పి శ్రీనాథ్, తాడేపల్లిగూడెం రూరల్ ఇన్స్పెక్టర్ రవి కుమార్, పట్టణ ఇన్స్పెక్టర్ ఆకుల రఘు తదితరులు ప్రసంగించారు. కళాశాల పాలక వర్గ అధ్యక్షులు గ్రంధి సత్యనారాయణ, టెక్నికల్ డైరక్టర్ అప్పారావు, ఇన్ ఛార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాంబాబులతో పాటు కళాశాల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.