Site icon NTV Telugu

Jagananna Gorumudda: పిల్లలకు గుడ్‌న్యూస్‌.. జగనన్న గోరుముద్దలో చేరిన మరో పోషకాహారం.

Jagananna Gorumudda

Jagananna Gorumudda

Jagananna Gorumudda: జగనన్న గోరుముద్ద పథకంలో మరో పోషకాహారం చేరింది.. మధ్యాహ్న భోజన పథకంలో మార్చి 2 నుంచి రాగిజావ అందించనున్నారు.. పిల్లలకు ఐరన్, కాల్షియం లోపాలు లేకుండా నివారించడానికి రాగిజావ అందించాలని నిర్ణయించారు.. ఇక, జగనన్న గోరుముద్ద మెనూలో రాగిజావ కార్యక్రమంలో భాగస్వామ్యం కానుంది శ్రీ సత్యసాయి ఛారిటబుల్‌ ట్రస్టు.. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ సమక్షంలో ఎంఓయూ చేసుకున్నారు విద్యాశాఖ అధికారులు, సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు ప్రతినిధులు.. జగనన్న గోరుముద్ద (మధ్యాహ్న భోజన పథకం) ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది.. బడి ఈడు పిల్లల్లో ఎన్‌రోల్‌మెంట్‌ను పెంచడంతో పాటు వారిలో ధారణ సామర్ధ్యం మెరుగుపర్చి, డ్రాపౌట్స్‌ను తగ్గించే కార్యక్రమాల్లో భాగంగా వారికి స్కూళ్లోనే రుచికరమైన పౌష్టికాహారాన్ని మధ్యాహ్న భోజనంలో అందిస్తోంది. జగనన్న గోరుముద్ద పథకం ద్వారా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 44,392 స్కూళ్లలో.. 37,63,698 విద్యార్ధులకు పౌష్టికాహారాన్ని అందిస్తోంది. ఈ పథకాన్ని 1 నుంచి 10 వ తరగతి వరకూ అమలు చేస్తోంది సర్కార్.

Read Also: Nara Lokesh: లోకేష్ పాదయాత్రలో అపశృతి..

జనవరి 2020 న నిర్వహించిన సమీక్షలో… పిల్లలకు మెరుగైన పౌష్టికాహారాన్ని అందించే కార్యక్రమంలో భాగంగా మిడ్‌ డే మీల్స్‌పై సీఎం జగన్‌ సమీక్షించి… వారికి అందిస్తున్న మెనూలో పలు మార్పులు చేపట్టారు. అందులో భాగంగా రోజు వారీ అందిస్తున్న మెనూతో పాటు పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడానికి వారంలో 5 రోజులు గుడ్డు, మూడు రోజులు బెల్లం, పల్లీ చిక్కీ ఇవ్వాలని నిర్దేశించారు. బెల్లం, పల్లీ చిక్కీ ఇవ్వని రోజుల్లో పిల్లలకు తగినంత ఐరన్, కాల్షియం అందించేందుకు వీలుగా చిరుధాన్యాలను మధ్యాహ్న భోజనపథకంలో భాగం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే … జగనన్న గోరుముద్దలో రాగిజావ అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో మధ్యాహ్న భోజనంలో చిక్కీ ఇవ్వని రోజుల్లో అందుకు బదులుగా రాగిజావను మెనూలో చేర్చుతూ నిర్ణయం తీసుకున్నారు. వారానికి మూడు రోజుల పాటు రాగిజావను మిడ్‌ డే మీల్స్‌లో భాగం చేశారు. ఈ కార్యక్రమం అమలు కోసం వివిధ స్వచ్ఛంద సంస్ధల బాగస్వామ్యం కూడా తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో శ్రీ సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు మిడ్‌ డే మీల్స్‌లో పిల్లలకు రాగిజావ అందించే కార్యక్రమంలో భాగస్వామి అయింది.

Read Also: CM YS Jagan: ఆదాయాన్నిచ్చే శాఖలపై సీఎం జగన్‌ సమీక్ష.. ఆ విధానాలను అధ్యయనం చేయాలని ఆదేశాలు

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం. శ్రీ సత్యసాయి ట్రస్ట్‌ ప్రతినిధులకు ధన్యవాదములు. ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమంలో భాగస్వామ్యులైనందుకు మీకు ధన్యవాదాలు. గోరుముద్ద కార్యక్రమంలో రాగిజావను అదనంగా చేర్చడం ద్వారా మరింత పౌష్టిహాకారం పిల్లలకు అందుతుంది. కేవలం గోరుముద్ద కార్యక్రమానికే రూ.1700 కోట్లు ఖర్చు పెడుతున్నాం. మూడున్నరేళ్ల క్రితం గోరుముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించాం. గతంలో కేవలం రూ.600 కోట్లు మాత్రమే మధ్యాహ్న భోజన పథకానికి ఖర్చు పెడితే మన ప్రభుత్వ హయాంలో ఆ ఖర్చు దాదాపు మూడు రెట్లు పెరిగిందన్నారు.. విద్యారంగంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టాం. తల్లులు తమ పిల్లలను బడికి పంపించేందుకు అవసరమైన ప్రోత్సాహాన్నివ్వడానికి ఉద్దేశించిన అమ్మఒడి దగ్గర నుంచి మొదలు పెడితే.. నాడు– నేడు ద్వారా స్కూళ్ల వ్యవస్ధను మార్పు చేసే కార్యక్రమం చేస్తున్నాం. 6వతరగతి ఆ పై తరగతుల్లో ప్రతి తరగతి గదిలో డిజిటిల్‌ స్క్రీన్‌ ఐఎఫ్‌పి ఏర్పాటు చేస్తున్నాం. 30,230 తరగతి గదుల్లో ఈ ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ప్యానెల్స్‌(ఐఎఫ్‌పి)లను ఏర్పాటు చేస్తున్నాం. నాడు–నేడు తొలిదశ పూర్తి చేసుకున్న సుమారు 15వేల స్కూళ్లలో ఈ జూన్‌ నాటికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాం. నాడు –నేడులో ఆఖరు కాంపొనెంట్‌ 6వతరగతి ఆపై తరగతులను డిజిటలైజ్‌ చేసే కార్యక్రమం చేస్తున్నాం. అంతకంటే దిగువ తరగతుల వారికి స్మార్ట్‌ టీవీలు ఏర్పాటు చేస్తున్నామని.. వీటితో పాటు పిల్లలకు విద్యాకానుక, గోరుముద్ద, ఇంగ్లిషు మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్, బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్స్, 3వ తరగతి నుంచి సబ్జెక్ట్‌ టీచర్ల కాన్సెప్ట్, 8వతరగతి పిల్లలకు ట్యాబులు పంపిణీ వంటి అనేక విప్లవాత్మక కార్యక్రమాలు చేపడతున్నాం. పిల్లల కరిక్యులమ్‌ను బైజూస్‌ కంటెంట్‌తో అనుసంధానం చేస్తూ.. విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నాం అని వివరించారు సీఎం జగన్‌.

Read Also: Google Maps: సూపర్ ఫీచర్స్‌తో గూగుల్ మ్యాప్స్‌..ఉన్నచోటు నుంచే!

ఇక, మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. మీ ఆలోచనలు, ఆదేశాలతో మార్చి 2 వ తేదీ నుంచి రాగిజావను జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా అందించాలని నిర్ణయించారు. దీనికి రూ.86 కోట్లు ఖర్చవుతుంది. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్ధలను భాగస్వామ్యం చేయాలన్న ఆలోచనతో సత్యసాయి ట్రస్టును ఇందులో భాగస్వామ్యం చేయడం జరిగింది. దీనికి అవసరమైన రాగి పిండి, బెల్లం పిండి సత్యసాయి ట్రస్టు సరఫరా చేస్తుంది. దీని ఖరీదు సుమారు రూ.42 కోట్లు ఉంటుంది. మూడు సంవత్సరాల పాటు సరఫరా చేస్తారు. దీనికి సంబంధించి ఇవాళ ఒప్పందం చేసుకుంటున్నాం అని తెలిపారు. శ్రీ సత్యసాయి మేనేజింగ్‌ ట్రస్టీ రత్నాకర్ మాట్లాడుతూ.. విద్యా రంగంలో మీరు అమలు చేస్తున్న పథకాలు వింటున్నాం.. చూస్తున్నాం. మీరు మధ్యాహ్న భోజనానికి పెట్టిన జగనన్న గోరుముద్ద పేరు చాలా బాగుంది. అమ్మ చేతి గోరు ముద్ద గుర్తుకు వచ్చేలా మంచి పేరు ఎంపిక చేశారు. మీరు అమలు చేస్తున్న అమ్మఒడి, ఆసరా ఇలా అన్నీ మంచి పథకాలు. మీరు చేస్తున్న కార్యక్రమాల్లో అన్నింటి కంటే నాడు–నేడు కార్యక్రమం అందరి కళ్లకూ ప్రత్యక్షంగా కనిపిస్తున్న మంచి, గొప్ప కార్యక్రమం. ఈ దేశం, రాష్ట్రం సురక్షితమైన భవిష్యత్తుకు పిల్లల చదువులు చాలా ముఖ్యం. పేద పిల్లలను చదువుకునే ప్రభుత్వ బడులను.. మీరు కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా మారుస్తున్నారని ప్రశంసలు కురిపించారు..

Exit mobile version