MP Mithun Reddy: తమను ఇబ్బంది పెట్టినా భరిస్తాం.. కానీ, కేడర్‌ జోలికి వస్తే ఊరుకోం.. మిథున్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

Mp Mithun Reddy

Mp Mithun Reddy

MP Mithun Reddy: తమను ఇబ్బంది పెట్టినా భరిస్తాం.. కానీ, పార్టీ కేడర్‌ జోలికి వస్తే మాత్రం ఎలక్షన్ కౌంటింగ్ పూర్తయ్యేలోపు సినిమా చూపిస్తామని హెచ్చరించారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి.. అన్నమయ్య జిల్లా పుంగనూరులో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రాజంపేట ఎంపీ మిథున్‌ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తమపై రెచ్చగొట్టి రాళ్లు వేయించారని మిథున్‌రెడ్డి ఆరోపించారు. పుంగనూరు ప్రశాంతంగా ఉండాలని, గొడవలు వద్దని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారని తెలిపారు. తనపై అనేక కేసులు పెట్టి జైలులో పెట్టినా.. తాము ఎప్పుడూ ఎవరినీ రెచ్చగొట్టలేదన్నారు. రాళ్లు వేసిన వారిని కూడా అమాయకులుగానే భావిస్తున్నామని.. ఎవరో చెప్పిన మాటలు విని అలా చేసి ఉంటారని ఇంట్లో మాట్లాడుకున్నామని చెప్పారు.

ఇక, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ శ్రేణులంతా కలిసికట్టుగా పోరాడి పార్టీని భారీ స్థాయిలో గెలిపించాలని పిలుపునిచ్చారు ఎంపీ మిథున్‌రెడ్డి..గతంలో ఏ ప్రభుత్వం కూడా పుంగనూరు గురించి ఆలోచించలేదని.. నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే జగన్ హయాంలో పలు ప్రాజెక్టులు సిద్ధం చేశామని తెలిపారు. టీడీపీ నాయకులకు పుంగనూరుపై సవతి తల్లి ప్రేమ మాత్రమే ఉందని మిథున్‌ రెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. అనేక పథకాలు అమలు చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రజలను మోసం చేశారని విమర్శించారు. గతంలో తమ ప్రభుత్వం అనేక గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసిందని.. కనీసం వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసే పరిస్థితిలో కూడా టీడీపీ ప్రభుత్వం లేదంటూ విమర్శలు గుప్పించారు ఎంపీ మిథున్‌ రెడ్డి..