Madanepalle Sub Collector Office Incident: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దహనం కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. కుట్ర కోణంపై ఇప్పటికే నిర్ధారణకు వచ్చిన పోలీసులు.. మాజీ మంత్రి ప్రధాన అనుచరుడు, వైసీపీ నేత మాధవ్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఘటన జరగడానికి 10 రోజుల ముందు నుంచి క్రమం తప్పకుండా మాధవరెడ్డి.. సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లినట్టు గుర్తించారు. ఫైల్స్ దహనం కేసులో అతని హస్తం ఉందని నిర్ధారించుకున్న పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పదిరోజుల పాటు వరుసగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి ఎందుకు వచ్చారు? ఏయే దస్త్రాలకు సంబంధించి ఎవరెవరిని కలిశారనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. పోలీసులు 10 ప్రత్యేక బృందాలుగా విడిపోయి విచారణలు చేపట్టారు. ఒక్కో బృందంలో టీం లీడర్‌గా డీఎస్సీ స్థాయి అధికారి ఉన్నారు. మదనపల్లి రెవెన్యూ డివిజన్‌కు సంబంధించి మొత్తం 11 మండలాల్లోని తాసిల్దార్ కార్యాలయాల్లో డిప్యూటీ తాసిల్దార్‌ల పర్యవేక్షణలో రికార్డుల తనిఖీలు చేపట్టారు. ఇప్పటికే సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న గౌతం తేజను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఇక, మాజీ మంత్రి వీర విధేయుడుగా ముద్రపడ్డ, గతంలో మదనపల్లి ఆర్డీవోగా పనిచేసిన మురళిని, మరో అర్డీవో హరిప్రసాద్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఆఫీస్ లోని 33 మంది ఉద్యోగులను అడిషనల్ ఎస్పీ విచారించి స్టే్‌ట్‌మెంట్ ను రికార్డు చేశారు. అయితే, ఈ రోజు ఇద్దరు ముగ్గురు కీలక వ్యక్తులపై కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. విచారణలో భాగంగా రాష్ట్ర రెవెన్యూ సిసోడియా, విద్యుత్, ఫైర్ శాఖలకు సంబంధించిన ముఖ్య అధికారులు సబ్ కలెక్టర్ ఆఫీస్ చేరుకుని విచారణ జరిపారు. ఇక అగ్ని ప్రమాదం జరిగిన చోట అడిషనల్ ఎస్పీ రాజకుమార్ సీన్‌ను రీ కన్స్ట్రక్షన్ చేశారు. మదనపల్లి రెవిన్యూ డివిజన్ పరిధిలోని 11 మండలాల తహసిల్దార్ కార్యాలయాలల్లో సోమవారం అర్ధరాత్రి వరకు ప్రత్యేక బృందాల తనిఖీలు నిర్వహించాయి. 22 ఏ ఫైల్స్ అన్నింటినీ కూడా ప్రత్యేక అధికారులు సీజ్ చేసి తీసుకెళ్లారు. దీంతో అక్రమాలు పాల్పడిన అధికారుల గుండెల్లో గుబులు నెలకొంది.
ఎన్నికలకు ముందు ఆర్డీవోగా పనిచేసిన మురళి ఘటనకు ముందు రోజు మదనపల్లెలో మకాం వేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుత ఆర్డీవోతోనూ ఆయన భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఆదివారం సెలవు రోజైనా కార్యాలయ సిబ్బంది కొందరు రాత్రి 10.30 గంటల వరకు అక్కడ ఉండటం, తర్వాత కొన్ని నిమిషాలకే ఘటన జరగడం, మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో పుంగనూరు, పీలేరు, తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాలకు చెందిన భూముల దస్త్రాలన్నీ ఉండటం.. రకరకాల సందేహాలకు తావిస్తోంది. ఇప్పటి వరకు పని చేస్తున్న సీసీ కెమెరాలు కూడా గత వారం, పది రోజులుగా పని చేయకపోవడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. కార్యాలయ సిబ్బందిని సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని, కాల్‌డేటాను పరిశీలిస్తున్నారు. ఆర్డీవో మురళి మాజీ మంత్రి, వైసీపీలో కీలక నేత పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డారు. గతంలో ఒంగోలులో పనిచేసిన సమయంలో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి.. దీనిపై ఆయన మదనపల్లె ఆర్డీవోగా ఉన్నప్పుడే సస్పెండ్ చేయడంతోపాటు తహసీల్దార్‌గా రివర్షన్ సైతం ఇచ్చారు. పెద్దిరెడ్డి జోక్యంతో సస్పెన్షన్ ఎత్తివేయడంతో పాటు రివర్షన్ కూడా ఉపసంహరించుకున్నారనే ప్రచారం ఉంది. ప్రస్తుతం మురళి తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్నారు. మదనపల్లె సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి దుండగులు అగ్గిపెట్టిన ఘటనలో కంప్యూటర్లలోని హార్డ్ డిస్క్‌లు కూడా పూర్తిగా కాలిపోయాయి. మాజీ మంత్రి తో పాటు ఆయన కుటుంబసభ్యులు పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో భారీగా భూదందాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.