MP Mithun Reddy: చౌడేపల్లిలో మిథున్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. టీడీపీ నేతలే భయపడి పారిపోయారు..!

Mithun Reddy

Mithun Reddy

MP Mithun Reddy: స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. అయితే, ఈ నేపథ్యంలో అన్నమయ్య జిల్లా చౌడేపల్లిలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పుంగనూరులో జరిగిన గొడవల అనంతరం దాదాపు 20 మంది టీడీపీ నాయకులు తనతో మాట్లాడారని ఆయన వెల్లడించారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని, “మా వాళ్లకు తల పనిచేయడం లేదు” అని కొందరు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. బయట ప్రాంతాల నుంచి వ్యక్తులను తీసుకొచ్చి రెచ్చగొడుతున్నారని వారు తన దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పారు.

అధికారం లేనప్పుడు కొందరు నాయకులు ఒక్కరు కూడా అందుబాటులో ఉండరని, రాష్ట్రంలో కూడా కనిపించకుండా పారిపోతారని, చివరకు తామే ఇక్కడ ఉండి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని కొందరు చెప్పినట్లు మిథున్‌రెడ్డి వివరించారు. ప్రస్తుతం కొత్తగా ఎవరూ అవసరం లేదని, తమతో ఉన్న కార్యకర్తలే సరిపోతారని అన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ కోసం నిలబడిన వారిని భవిష్యత్తులో తన భుజాలపై మోసుకుని కాపాడుకుంటానని భరోసా ఇచ్చారు. కార్యకర్తల్లో ఉన్న భయాన్ని పెట్టుబడిగా చేసుకుని ప్రత్యర్థులు రాజకీయం చేస్తున్నారని మిథున్‌రెడ్డి విమర్శించారు. భయపడితే రాజకీయాలు చేయలేమని స్పష్టం చేశారు. తాను నామినేషన్ వేసినప్పుడు ముందుగా వెళ్లానని, “మీరు వెళ్లండి.. నేను తర్వాత వస్తా” అని కార్యకర్తలకు చెప్పలేదని గుర్తుచేశారు. మరోవైపు, టీడీపీ నాయకులే భయపడి ఒక్కొక్కరు ఒక్కో దిక్కుకు వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు.

తాము హత్యలు, అత్యాచారాలు చేయలేదని, అలాంటప్పుడు భయపడాల్సిన అవసరం ఏముందని మిథున్‌రెడ్డి ప్రశ్నించారు. కేసులు పెడతారు.. అంతేగా అని అన్నారు. గతంలో జైలుకు వెళ్లినప్పుడు కూడా తలెత్తుకుని వెళ్లానని, తిరిగి వచ్చినప్పుడు కూడా తలెత్తుకునే వచ్చానని చెప్పారు. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. ఇక, కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ఎవరికైనా ఏదైనా జరిగినా ఆ బాధ్యత తనదేనని, అందరినీ కాపాడుకుంటానని స్పష్టం చేశారు. అయితే, కార్యకర్తలు అరాచకాలకు పాల్పడాలని తాను చెప్పడం లేదని, చట్టానికి లోబడి న్యాయంగా తమ నామినేషన్లు తామే వేయాలని సూచించారు. నామినేషన్లు వేయకుండా రాజకీయాలు చేయలేమని పేర్కొన్నారు. ప్రత్యర్థులకు నిజంగా సత్తా ఉంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి చూపించాలని సవాల్ విసిరారు ఎంపీ మిథున్‌ రెడ్డి..