Site icon NTV Telugu

CM Chandrababu: గుడ్‌న్యూస్‌.. ఉగాదిలోపు 5 లక్షల మందికి ఇళ్లు..

Cbn

Cbn

CM Chandrababu: ఉగాది లోపు 5 లక్షల గృహ ప్రవేశాలు జరిగేలా చేస్తామని సీఎం నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అన్నమయ్య జిల్లా పర్యటనలో భాగంగా చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో ప్రభుత్వ పక్కా గృహాల్లో గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. ప్రజావేదికలో పక్కా గృహాల లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గృహనిర్మాణ రంగంలో కొత్త దశ ప్రారంభమవుతోందని, పేద కుటుంబాల కలల ఇల్లు ఇప్పుడు వాస్తవ రూపం దాలుస్తుందని తెలిపారు. గతంలో, జగనన్న కాలనీ పేరుతో ఇళ్ల స్థలాలు కేటాయించి వదిలేసారని, అక్కడ రోడ్లు, నీరు, విద్యుత్ వంటి సౌకర్యాలు కూడా కల్పించలేదని ఆయన విమర్శించారు. అడవులు, చెరువుల దగ్గర స్థలాలు ఇచ్చి ప్రజల జీవితాలతో జగన్ ప్రభుత్వం ఆటలాడిందని మండిపడ్డారు.. ఇక, ఇంటి నిర్మాణానికి ముస్లిం కుటుంబాలకు అదనంగా రూ.50,000 ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు సీఎం చంద్రబాబు..

Read Also: Suicide: పెళ్లి కావడం లేదని.. రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య..

ఇక, కేంద్ర ప్రభుత్వం తాగునీటి పథకం ప్రవేశపెట్టినా గత ప్రభుత్వం దాన్ని ఉపయోగించుకోలేదని విమర్శించారు చంద్రబాబు.. రాయచోటి నియోజకవర్గానికి త్వరలో ఇంటింటికి నీళ్ళు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, రాష్ట్రం మొత్తం నదుల అనుసంధానం తన జీవిత లక్ష్యమని చెప్పారు. ఇప్పటికే గోదావరి – కృష్ణా అనుసంధానం విజయవంతమైందని, గంగా – కావేరి అనుసంధానం చేస్తే దేశం మొత్తానికి నీటి కొరత ఉండదని పేర్కొన్నారు.. మరోవైపు, గతంలో విద్యుత్‌ కష్టాలు ఉండేవి.. కానీ, ఇప్పుడు, ప్రతి ఇంటికి సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. రైతులు తమ పొలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తే, ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీల రేటుకే కొనుగోలు చేస్తుందన్నారు.

ఉపాధ్యాయ నియామకాలలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం అన్నారు సీఎం చంద్రబాబు.. గత ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఇవ్వని జగన్ ప్రభుత్వాన్ని విమర్శించిన చంద్రబాబు, కూటమి ప్రభుత్వం మెగా DSC ద్వారా 16 వేల టీచర్ ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు. ఇక, గత 18 నెలల్లో రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, రేపు విశాఖలో మరో రూ.10 లక్షల కోట్ల విలువైన MOUలు కుదుర్చుకోబోతున్నామని తెలిపారు. ఏడాదిలోపే శ్రీనివాసపురం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని, రోడ్ల నిర్మాణంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తామని చెప్పారు.. తాజాగా 730 ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఇక త్వరలోనే ప్రజల ఆరోగ్యానికి అంకితమైన ‘సంజీవని కార్యక్రమం’ ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు.

Exit mobile version