ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ వార్ నడుస్తోందా? టీడీపీ నేతల వరుస అరెస్ట్ లు దానికి సంకేతమా? అంటే అవుననే అనిపిస్తోంది. కడప, అనంతపురం పర్యటనల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు టీడీపీ నేతల్ని వేధించడంపై మండిపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా విజయవాడ శివారులో టీడీపీ నేతను పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది.
గొల్లపూడిలో టీడీపీ నాయకుడు ఆలూరి హరికృష్ణ చౌదరి చిన్నాను అరెస్ట్ చేశారు పోలీసులు. శుక్రవారం అర్ధరాత్రి చిన్నాని అరెస్ట్ చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి తరలించారు పోలీసులు. ఏం కేసు నమోదు చేశారో కూడా చెప్పకుండా చిన్నాను అరెస్ట్ చేశారంటోంది టీడీపీ. చిన్నా అరెస్టుపై టీడీపీ నేత దేవినేని ఉమ అభ్యంతరం తెలిపారు. గత రాత్రి నుంచి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్దే ఉన్నారు దేవినేని ఉమ.
దీంతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కి చేరుకుంటున్నారు మైలవరం నియోజకవర్గం కార్యకర్తలు. వైసీపీ నేత కోమటి రామ్మోహన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. ఆలూరి చిన్నాపై 307, 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. ఆలూరి చిన్నా-కోమటి రామ్మోహన్ మధ్య ఆర్ధిక లావాదేవీల్లో తేడా వచ్చే దాడి జరిగిందంటున్నారు పోలీసులు. దేవినేని ఉమ వెంట తిరుగుతూ టీడీపీలో క్రియాశీలకంగా ఉంటారు కాబట్టే అక్రమంగా కేసు బనాయించారంటోంది టీడీపీ. తాజా ఘటనపై నిరసన తెలిపేందుకు సన్నద్ధం అవుతున్నారు టీడీపీ నేతలు, కార్యకర్తలు.
